నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలంటే.. అందరికీ మొదట గుర్తుకు వచ్చేది పవర్ ఫుల్ డైలాగ్స్, హై ఓల్టేజ్ ఫైట్ సీన్లే. ఇవి లేకుంటే ఆయన సినిమాల్లో ఏదో వెలితిగానే ఉంటుంది. కానీ, ఒక్క ఫైట్ సీన్ లేకపోయినా బాలయ్య కెరీర్‌లో సూపర్ డూపర్ హిట్టైన సినిమా ఏదో తెలుసా.. `నారీ నారీ నడుమ మురారి`. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన చిత్రమది.
ఇందులో బాలయ్య సరసన శోభన, నిరోషా హీరోయిన్లుగా నటించగా.. శారద, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, రమాప్రభ తదితరులు కీలక పాత్రలను పోషించారు. యువ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై కె.మురారి నిర్మించిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ స్వరాలు అందించాడు. బాలయ్య కెరీర్‌లో 50వ చిత్రమిది. తమిళనాడులో వేలచ్చేరి ప్రాంతంలోని చిరంజీవి గెస్ట్ హౌస్ లో ఈ మూవీ షూటింగ్ జరిగింది.
ఎటువంటి కమర్షియల్ హంగులకు పోకుండా కుటుంబ కథా చిత్రంగా `నారీ నారీ నడుమ మురారి` తెరకెక్కించారు. 1990 ఏప్రిల్ 27న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. కె.వి.మహదేవన్ స్వరపరచిన పాటలు, నేపథ్య సంగీతం సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన బలంగా నిలిచాయి. ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేకపోవడం మరో విశేషం. అయినప్పటికీ ప్రేక్షకాభిమానులను అలరించాడు బాలయ్య.
ఇందులో ఆయన నటన, కామెడీ టైమింగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు. అంతటి విజయాన్ని అందుకుందీ చిత్రం. ఒక మాస్ హీరో క్లాస్ సినిమా చేస్తే ఆ మూవీ ఏ రేంజ్ హిట్ అవుతుందో చెప్పడానికి నారీ నారీ నడుమ మురారి నిదర్శనం అని చెప్పొచ్చు.