మణిరత్నం సౌత్ ఇండియాలోనే తిరుగులేని క్రేజీ డైరెక్టర్. ఇటీవల కాలంలో ఆయన రేంజ్‌కు తగిన సినిమాలు రాకపోవచ్చు కానీ మణరిత్నంకు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ సినీ ప్రేమికులు ఉన్నారు. నిన్నటి తరం ప్రేక్షకులకు మణిరత్నం గురించి బాగా తెలుసు. రోజా – బొంబాయి – గీతాంజలి – దళపతి లాంటి సినిమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించడంతో పాటు టేకింగ్‌లో అప్పట్లో సరికొత్త ట్రెండ్‌ను ఆయన క్రియేట్ చేశారు.
ఇప్పట్లో చాలా మంది క్రియేటివ్ దర్శకులు పుట్టుకు వస్తున్నారు. కానీ ఆ రోజుల్లోనే టేకింగ్ పరంగా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేయడానికి ఆధ్యుడు మణిరత్నం. మణిరత్నం టేకింగ్‌ను చూసే ఎంతో మంది ఆయన స్టైల్‌ను ఫాలో అయ్యేందుకు ట్రై చేశారు. కేవి. ఆనంద్, గౌతమ్ మీనన్ లాంటి వాళ్లు కూడా మణిరత్నం స్టైల్లోనే సినిమాలు తీస్తూ ఉంటారు.
మణిరత్నం కెరీర్ పరంగా స్పీడ్‌గా ఉన్నప్పుడే సీనియర్ నటి సుహాసినిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నారు. మణిరత్నం దర్శకత్వ ప్రతిభ చూసి మనసు పారేసుకునే తాను ఆయన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని చెప్పారు. అయితే వీరిది ప్రేమ వివాహం కాదు.. పెద్దలు కుదిర్చిన వివాహమే అని సుహాసిని తాజాగా చెప్పారు.
సుహాసిని హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చాక ఆమెకు హీరోయిన్‌గా మంచి క్రేజ్ వచ్చింది. అటు తమిళ్‌తో పాటు తెలుగులోనూ స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఆ టైంలో మణిరత్నం సుహాసినికి కథ చెప్పేందుకు ఆమె ఇంటికి వచ్చారట. అయితే మణి చెప్పిన కథ నచ్చకపోవంతో వెంటనే నో చెప్పేసిందట. మణిరత్నం మాత్రం ఏ మాత్రం ఫీల్ కాకుండా వెళ్లిపోయారట.
ఇక సుహాసిని ఎవరో కాదు కమల్‌హాసన్ సోదరుడు చారుహాసన్ కుమార్తె అన్న విషయం తెలిసిందే. మణిరత్నం అన్న, చారుహాసన్ బెస్ట్ ఫ్రెండ్స్ అట. వాళ్లిద్దరు కలిసే మణిరత్నంకు, సుహాసినికి పెళ్లి చేస్తే బాగుంటుందన్న ఆలోచన చేశారట. అప్పుడు మా నాన్న గారు నాతో మణిరత్నంతో పెళ్లి ప్రస్తావన తేవడంతో పాటు ఓ సారి ఆయనతో మాట్లాడమని చెప్పారట.
అప్పుడు మణిరత్నంతో మాట్లాడితే కాని.. ఆయన ఏంటో తనకు అర్థం కాలేదని సుహాసిని చెప్పారు. మణితో ట్రావెల్ చేయడం మొదలు పెట్టాకే మా ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు ఒక్కటే అన్న విషయం తనకు అర్థమైందని ఆమె అన్నారు. ఆయన తన స్వేచ్ఛను గౌరవిస్తూ.. తనను ఏనాడు ఇబ్బందులు పెట్టలేదని.. ఆయన సపోర్ట్ వల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు.