టాలీవుడ్‌లో సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ – మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా కెరీర్‌ను కొసాగిస్తూ ఎవరికి వారు తమకు తామే పోటీ అన్నట్టుగా దూసుకుపోతున్నారు. అసలు రెండు దశాబ్దాల క్రితం ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఆ పోటీయే వేరుగా ఉండేది. అందులోనూ సంక్రాంతికి చిరు, బాలయ్య సినిమాలు రిలీజ్ అయితే బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే ఉంటుంది. సమరసింహారెడ్డి – స్నేహంకోసం, నరసింహానాయుడు – మృగరాజు ఆ తర్వాత లాంగ్ గ్యాప్ వచ్చినా కూడా 2017లో ఈ ఇద్దరు హీరోలు తమ కెరీర్‌లోనే ప్రెస్టేజియస్ సినిమాలతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు.
చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమా, బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి రెండు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడి రెండూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అసలు ఈ రకమైన పోటీ ఉంటే ఫ్యాన్స్‌కు అంతకన్నా కావాల్సింది ఏం ఉంటుంది. పైగా వీరిద్దరు ఇండస్ట్రీలో రెండు వేర్వేరు కాంపౌండ్‌లకు పెద్ద ప్రతినిధులుగా ఉన్నారు. అయితే వీరిద్దరు కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. అయితే ఇది కొన్ని కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు.
నిజంగా ఈ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కి ఉంటే అది ఇండస్ట్రీలో ఎందరో హీరోల మధ్య ఎన్నో మల్టీస్టారర్ సినిమాలకు కేంద్ర బిందువు అయ్యి ఉండేది. అప్పట్లో స్టార్ హీరోలతో ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కించి హిట్లు కొట్టిన ఘనత దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుకే దక్కేది. శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావుతో సినిమా చేయాలని ఏ స్టార్ హీరో అయినా కలలు కనేవాడు.
ఇదే సమయంలో రాఘవేంద్రుడు చిరంజీవి – బాలకృష్ణ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ తెరకెక్కించాలని ప్రయత్నాలు చేశారు. ఇద్దరు హీరోలకు కథ చెప్పాడు. వీరికి కథ నచ్చడంతో సినిమా కూడా ఓకే అయ్యింది. షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కాని..మెగాస్టార్ చిరంజీవి ఆ ప్రాజెక్టు నుంచి సడెన్‌గా డ్రాప్ అయ్యారు. ఆయనకు అదే టైంలో రెండు, మూడు క్రేజీ ప్రాజెక్టులు రావడంతో అటు మొగ్గు చూపారని అంటారు.
అయితే సినిమా షూటింగ్‌కు బ్రేక్ రాకూడదని.. మధ్యలో ఆగకూడదని బాలయ్య డిసైడ్ అయిపోయారు. దీంతో రాఘవేంద్రరావుతో సినిమాలో రెండు పాత్రలను తానే చేస్తానని చెప్పేశారట. ఇంతకు ఆ సినిమా ఏదో కాదు అపూర్వ సోదరులు. అయితే ఈ సినిమా ముందుగా బాలయ్య – చిరు కాంబినేషన్లో రావాల్సిన మల్టీస్టారర్ అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.