నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణకు మూడు వరుస ప్లాపుల తర్వాత అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అఖండ జాతర మోగించేశాడు. ఈ సినిమాలో బాలయ్య మాస్ విశ్వరూపం చూపించడంతో థియేటర్లలో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ హ్యాట్రిక్ కాంబినేషన్‌లో వచ్చి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. బాలయ్య కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంతగా ఏకంగా రు. 200 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది.
బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పైగా కరోనా సెకండ్ వేవ్ తర్వాత అసలు పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తే థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా ? రారా ? అసలే ఏపీలో టిక్కెట్ రేట్లు చాలా తక్కువుగా ఉన్నాయ్.. ఇలాంటి సందేహాల మధ్య బాలయ్య డేర్ చేసి ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకువచ్చారు. అయితేనేం సినిమా థియేటర్లలో అన్ని వర్గాల ప్రేక్షకులను పూనకాలు తెప్పించేసింది. ఇదంతా బాలయ్య వన్ మ్యాన్ షో అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
పైగా థియేటర్లలో మనం 50 రోజులు పోస్టర్ చూసే చాలా రోజులు అయ్యింది. అలాంటిది అఖండ ఏకంగా 103 కేంద్రాల్లో 50 రోజులు.. 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. కర్నూలులో గ్రాండ్‌గా 100 రోజుల పండగ కూడా చేసుకుంది. ఇక ఓటీటీలో వచ్చి ఇక్కడ కూడా కుమ్మేసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే 120 రోజులు అవుతోంది. అయినా కూడా చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో ఇంకా డైరెక్టుగా 4 ఆటలతో రన్ అవుతోంది.
ఇక ఏపీ, తెలంగాణలో ఎక్కడ చూసినా వీథుల్లో అఖండ షోలు వేసుకుని.. ఊరంతా ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు ప్రజలు ఇంకా అఖండ మానియా నుంచి బయటకు వచ్చినట్టు లేరు. తాజాగా ఈ సినిమా మరోసారి మాస్ జాతరకు రెడీ అవుతోంది. ప్రముఖ ఛానెల్ స్టార్ మా లో ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అఖండను ప్రసారం చేసేందుకు ప్లాన్ చేసుకుంటోంది.
ఈ ప్రీమియర్‌కు ఇంకా డేట్ ఖరారు కాలేదు. డేట్.. టైం ఫిక్స్ అవ్వాల్సి ఉంది. ఇప్పటికే వెండితెరతో పాటు ఇటు ఓటీటీలో ఎన్నో సంచలన రికార్డులు నమోదు చేసిన అఖండ.. ఇప్పుడు బుల్లితెరపై ప్రీమియర్ షోగా ప్రసారం అయితే మరెన్ని రికార్డులు నమోదు చేస్తుందో ? చూడాలి. ఇక బాలయ్య తన తర్వాత సినిమాను మలినేని గోపీచంద్ డైరెక్షన్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.