అఖండ అప్పుడెప్పుడో డిసెంబర్ 2న రిలీజ్ అయ్యింది. మధ్యలో చాలా పెద్ద సినిమాలు వచ్చాయ్.. అంతే వేగంతో వెళ్లిపోతున్నాయ్. అఖండ జోరు ప్రతి రోజు ఏదో ఒక రూపంలో కంటిన్యూ అవుతూనే వస్తోంది. అఖండ తెలుగు గడ్డ మీద, అటు కర్నాకట బళ్లారి, రాయచూర్ ఏరియాల్లో ఏదో ఒక రోజు ఏదో ఒక థియేటర్లో షో పడుతూనే వస్తోంది. తాజాగా ఒంగోలులో అఖండను మళ్లీ ప్రదర్శిస్తున్నారు. ఇక గుంటూరు జిల్లా చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో 140 రోజులు క్రాస్ అయ్యి… 175 రోజుల దిశగా అఖండ దూసుకుపోతోంది.
ఇక ఏపీ, తెలంగాణలో పల్లెటూర్లలో ఏ ఫంక్షన్ జరిగినా.. ఏ పండగ వచ్చినా అఖండను వీథి బొమ్మగా ప్రదర్శిస్తూ ఊరంతా కలిసి జాతరలా చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఓటీటీలో వచ్చిన అఖండను అఖండ రేంజ్‌లో ప్రజలు ఆదరిస్తున్నారు. ఓటీటీలో కూడా తక్కువ టైంలో ఎక్కువ మంది వీక్షించిన సినిమాగా అఖండ మరో రికార్డు సొంతం చేసుకుంది. ఈ పరంపరలోనే అఖండ తాజాగా బుల్లితెరపై ఫస్ట్ టైం ప్రీమియర్‌గా వేశారు. గత ఆదివారం స్టార్ మా ఛానెల్ అఖండ టెలీకాస్ట్ చేశారు.
అఖండ సినిమాకు ఏకంగా 13 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. బాలయ్య సినిమాలకు ఇటీవల కాలంలో ఈ రేంజ్ టీఆర్పీ రావడం రికార్డే. బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి బ్లాక్‌బస్టర్ అయ్యింది. అయితే ఆ సినిమాను కూడా ఫస్ట్ టైం టెలీకాస్ట్ చేసినప్పుడు ఓ అరుదైన రికార్డు సొంతం అయ్యింది. తెలుగు సినిమా చరిత్రలో ఓ బ్లాక్‌బస్టర్ మూవీ టెలికాస్ట్ చేసినప్పుడు ఒకే రోజు రెండు ఛానెల్స్‌లో టెలికాస్ట్ చేశారు.
సాయంత్రం 6 గంటలకు మా టీవీలో శాతకర్ణి ప్రసారమైంది. ఆ వెంటనే 9 గంటలకు మా మూవీస్ ఛానెల్లో మళ్లీ శాతకర్ణి వేశారు. ఇది ముందే చెప్పి మరీ వేశారు. అలా రెండు సార్లు టెలికాస్ట్ అయినా కూడా శాతకర్ణికి అప్పుడు మంచి టీఆర్పీయే వచ్చింది. ఇక ఇప్పుడు అఖండ మానియా ఇంకా తగ్గలేదు అనేందుకు వచ్చిన 13 టీఆర్పీయే నిదర్శనం. అఖండ రికార్డులు చూస్తుంటే ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు.
ఇక ఒక పెద్ద సినిమా ఫస్ట్ టైం ప్రీమియర్‌గా వేస్తున్నప్పుడు పోటీ ఛానెల్స్ కూడా పెద్ద సినిమాలే వేస్తూ ఉంటారు. ఈ సారి అలా జరగలేదు. అఖండ ప్రసారమవుతోన్న టైంలోనే జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సామాన్యుడు సినిమా ప్రసారం చేశారు. ఆ సినిమాకు కేవలం 2.6 టీఆర్పీ మాత్రమే వచ్చింది. అఖండ దెబ్బతో విశాల్ సినిమా ఫస్ట్ టైం ప్రసారం చేసినా అడ్రస్ గల్లంతైంది.