సాధారణంగా దర్శకులు ఓ హీరోను దృష్టిలో పెట్టుకుని కథలు రెడీ చేస్తూ ఉంటారు. ఆ హీరో ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌ను దృష్టిలో పెట్టుకునే కథలు తయారు చేయడం.. కథలో మార్పులు.. చేర్పులు చేయడం జరుగుతుంది. ఏవైనా కారణాలతో ఆ హీరో ఆ కథ రిజెక్ట్ చేయడంతో మరో హీరో చేసి హిట్లు కొడుతూ ఉంటారు. కొన్ని కథలు ఓ హీరో కోసం రెడీ చేసుకుంటే.. అవి చేతులు మారి మరో హీరో దగ్గరకు వెళతాయి. అలా టాలీవుడ్‌లో కొందరు హీరోలు తమకు రావాల్సిన హిట్ సినిమాలు మిస్ అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎడిటర్ మోహన్ బ్యానర్లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో హిట్లర్ సినిమా వచ్చింది. ఐదుగురు అక్కచెళ్లెల్ల ముద్దుల అన్నయ్యగా చిరంజీవి ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో రంభ హీరోయిన్. అన్నా, చెళ్లెల్ల సెంటిమెంట్ ఈ సినిమాను సూపర్ హిట్ చేసేసింది. మూడేళ్ల నుంచి హిట్ అన్నది లేకుండా వరుస ప్లాపులతో సతమతమవుతోన్న చిరు కెరీర్‌ను ఒక్కసారిగా టర్న్ చేసింది. ఈ సినిమాతోనే చిరుకు తిరుగులేని మార్కెట్ ఏర్పడింది.
చిరంజీవి – రంభ కాంబినేషన్ వెండితెరపై అదుర్స్ అనిపించేసింది. వీరిద్దరి జోడీ చూసేందుకే తెలుగు ప్రేక్షకులు ఒకటికి రెండు సార్లు థియేటర్లకు క్యూ కట్టి హిట్లర్‌ను బంపర్ హిట్ చేశారు. అయితే ఈ కథను ముందుగా చిరంజీవితో తీయాలని అనుకోలేదు. మళయాళంలో ముమ్ముట్టి హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమా కథ గురించి ముందుగానే ఎడిటర్ మోహన్‌కు తెలిసింది. ఆయన ఆ సినిమా గురించి తెలుసుకుని తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు.
ఆ కథకు హిట్టయ్యే లక్షణాలు ఎక్కువుగా కనపడడంతో రీమేక్ రైట్స్ తీసుకుని ఓ క్యాసెట్ తెప్పించుకుని రచయిత మరుధూరి రాజాకు చూడమని చెప్పారు. రాజా ఈ సినిమా చాలా బాగుందని చెప్పారు. ఈ క్రమంలోనే కలెక్షన్‌కింగ్ మోహన్‌బాబు హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ఈ సినిమా రీమేక్ చేయాలని అనుకున్నారు. మోహన్‌బాబుకు కథ కూడా వినిపించారు. అయితే అప్పటికే మోహన్‌బాబు వీడెవడండీ బాబు – అదిరింది అల్లుడు సినిమాలతో బీజీగా ఉన్నారు.
దీంతో ఈ కథ విన్న చిరు వెంటనే ఓకే చెప్పేశారు. చిరు ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్పులు చేశారు. చివరకు రచయితగా ముందు అనుకున్న రాజా ప్లేసులో ఎల్బీ శ్రీరామ్ వచ్చి చేరారు. ఇలా మోహన్‌బాబు ఖాతాలో పడాల్సిన ఆ హిట్ చిరంజీవి చేసి హిట్ కొట్టారని రాజా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.