మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో `ఖైదీ` ఒకటి. ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంయుక్త మూవీస్ బ్యానర్‌పై తిరుపతి రెడ్డి, ధనంజయరెడ్డి, సుధాకర రెడ్డి కలిసి నిర్మించారు. ఇందులో మాధవి, సుమలత హీరోయిన్స్‌గా నటించగా.. చక్రవర్తి సంగీతం అందించారు. పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు అందించారు. 1983లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ రారాజు అయిపోయాడు చిరు.
ఖైదీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టడమే కాదు.. ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రంలో ఫైట్స్, సాంగ్స్ మరియు మెగాస్టార్ స్టెప్పులు విశేషంగా అలరించాయి. ఇరవై సెంటర్లలో 100 రోజులు, ఆరు సెంటర్లలో ఏకంగా 200 రోజులు ఆడిన ఈ చిత్రం.. అప్పట్లోనే ఎనిమిది కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్స్‌తో పాటు నిర్మాతలు సైతం భారీ లాభాలను పొందారు. ఈ సినిమాలో రగులుతోంది మొగలు పొద లాంటి పాటలకు చిరంజీవి – మాధవి వేసిన స్టెప్పులు తెలుగు నాట ఓ ఊపు ఊపేశాయి.
అప్పటి వరకు మాములు హీరోగా ఉన్న చిరంజీవి ఖైదీతో స్టార్ హీరోగా మారాడు. అలాగే పరుచూరి బ్రదర్స్ స్టార్ రైటర్స్‌గా ఎదగగా.. కోదండరామిరెడ్డి మాస్ దర్శకుడిగా తన సత్తా ఏంటో ప్రేక్షకులకు రుచి చూపించాడు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ చేయాల్సి ఉంది. అవును, దర్శకుడు కోదండరామిరెడ్డి మొదట కృష్ణను కలిసి కథను వివరించారట.
కానీ, అది ఆయనకు నచ్చకపోవడంతో సున్నితంగా రిజెక్ట్ చేశారట.
ఆ తర్వాత కథలో మార్పులు, చేర్పులు చేసి చిరంజీవికి చెప్పగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలాగే చిరు దగ్గరుండి తనకు నచ్చినట్లుగా కథలో కొన్ని మార్పులు చేయించి.. అపై సినిమాను పట్టాలెక్కించారట. 1982 జూన్ 16న మద్రాసులోని ప్రసాద్ స్టూడియో మూడో ఫ్లోర్‌లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది.ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి, మాధవిలపై సూపర్ స్టార్ కృష్ణ క్లాప్ కొట్టడం మరో విశేషం.