సీనియర్ హీరో శ్రీకాంత్ మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. శ్రీకాంత్ కెరీర్ విచిత్రం. కర్నాటకలోని బళ్లారి జిల్లాకు చెందిన శ్రీకాంత్‌ది తెలుగు మూలాలు ఉన్న కుటుంబమే. సినిమాలపై ఇంట్రస్ట్‌తో ఇంట్లో చెప్పా పెట్టకుండానే చెన్నై చెక్కేసిన శ్రీకాంత్‌కు కెరీర్ స్టార్టింగ్‌లో సులువుగా అవకాశాలు రాలేదు. ముందుగా విలన్ వేషాలే వచ్చాయి. సీతారత్నం గారబ్బాయి, అబ్బాయిగారు సినిమాల్లో నెగటివ్ రోల్స్ చేసిన శ్రీకాంత్ ఆ తర్వాత హీరో అయ్యాడు. చిన్న చిన్న హిట్లు పడడంతో ఒకానొక టైంలో టైర్ టు హీరోల్లో స్టార్‌గా ఓ వెలుగు వెలిగాడు.
ఇక ఇటీవల సెకండ్ ఇన్సింగ్స్‌లో శ్రీకాంత్ విలన్ పాత్రలు చేస్తున్నాడు. బాలయ్య అఖండ సినిమాలో పవర్ ఫుల్ విలన్‌గా మెప్పించాడు. శ్రీకాంత్ సెకండ్ ఇన్సింగ్స్ లో పవర్ ఫుల్ పాత్రలే వస్తున్నాయి. ఇక శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నిర్మలా కాన్వెంట్‌తో హీరోగా పరిచయం అయ్యాడు. అన్నపూర్ణ బ్యానర్‌పై నాగార్జున స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా క్లిక్ కాలేదు.
తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో అలనాటి మేటి క్లాసిక్ పెళ్లిసందడి సినిమాకు సీక్వెల్‌గా పెళ్లిసందD సినిమాలో నటించారు. విజయవాడ అమ్మాయి శ్రీలీల హీరోయిన్‌గా చేసిన ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో పాటు రోషన్‌కు కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. దీంతో రోషన్‌కు పెద్ద బ్యానర్ల నుంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ రోషన్‌ను హీరోగా మాంచి కమర్షియల్ ప్రాజెక్టు ఒకటి ప్లాన్ చేస్తోంది.
ఈ సినిమా త్వరలోనే పట్టాలు ఎక్కనుంది. అయితే ఇంతలోనే రోషన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన పేరును మార్చేసుకున్నాడు. తన పేరులోని స్పెల్లింగ్‌ను “Roshann” గా మార్చుకున్నాడు. రోషన్ న్యూమరాలజీ సెంటిమెంట్లు ఫాలో అవుతున్నాడు. ఈ సెంటిమెంట్ ప్రకారమే
తన పేరుకు అదనంగా ‘n’ని జోడించాడు.
తెలుగు యంగ్ హీరోలు ఇలా సెంటిమెంట్ల ప్రకారం పేర్లు మార్చుకోవడం రోషన్‌తో కొత్త కాదు. గతంలో సాయిధరమ్ తేజ్ తన పేరు చిత్రలహరి సినిమా నుంచి సాయితేజ్‌గా మార్చుకున్నాడు. వైష్ణవ్ తేజ్ పంజా వైష్ణవ్‌గా మార్చుకున్నాడు. మరి ఇప్పుడు రోషన్‌కు ఈ పేరు మార్పు సెంటిమెంట్ ఎంత వరకు ఫలిస్తుందో ? చూడాలి.