టైటిల్: RRR
బ్యానర్: డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్
సమర్పణ: డీ పార్వతి
నటీనటులు: ఎన్టీఆర్, రామ్‌చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్, ఒవీలియో మోరిస్, శ్రీయా శరణ్, సముద్రఖని
కస్టమ్ డిజైనర్: రమా రాజమౌళి
లైన్ ప్రొడ్యుసర్: ఎస్ఎస్. కార్తీకేయ
పోస్ట్ ప్రొడక్షన్ లైన్ ప్రొడ్యుసర్: ఎంఎం. శ్రీవల్లి
సినిమాటోగ్రఫీ: కెకె. సెంథిల్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్
ఎడిటర్: శ్రీకర ప్రసాద్
మ్యూజిక్: ఎంఎం. కీరవాణి
స్టోరీ: విజయేంద్ర ప్రసాద్
మాటలు: సాయి మాధవ్ బుర్రా
నిర్మాత: డీవీవీ దానయ్య
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజమౌళి
సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ
రిలీజ్ డేట్ : 25 మార్చి, 2022
RRR పరిచయం:
RRR దాదాపు మూడున్నర సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ – రామ్‌చరణ్ కాంబినేషన్లో రాజమౌళి దర్శకత్వంలో సినిమా ఉంటుందని ప్రెస్‌మీట్ పెట్టి ఎనౌన్స్ చేసినప్పుడు అందరూ షాక్ అయ్యారు. బాహుబలి ది కంక్లూజన్ లాంటి బిగ్గెస్ట్ ఇండియన్ హిట్ తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారు ? హీరోలు ఎవరు ? అని అందరూ వెయిట్ చేస్తోన్న టైంలో ఎన్టీఆర్ – చరణ్ కాంబినేషన్ సెట్ చేయడంతోనే రాజమౌళి అందరి దృష్టి సినిమా వైపు తిప్పేశారు. ఆ ప్రకటనతోనే సినిమా సగం హిట్ అయిపోయింది. అప్పుడెప్పుడో 13 ఏళ్ల క్రితం అంటే మగధీర హిట్ అయ్యాక నిర్మాత దానయ్య రాజమౌళికి భారీ అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ మాట కోసం మధ్యలో మర్యాదరామన్న లాంటి సినిమా చేయాలని దానయ్యను రాజమౌళి అడిగినా.. తనకు పెద్ద సినిమాయే కావాలని అడిగారు. ఆ కోరిక మేరకు రాజమౌళి అదిరిపోయే విజువల్ ఫీస్ట్‌ను ఆయన బ్యానర్లో తెరకెక్కించారు. రు. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి రేంజ్లో నిలిచిపోయేలా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ అవుతోంది. ఆకాశాన్నంటే అంచనాలు.. పీక్స్‌లో ఉన్న ప్రమోషన్లతో.. ఊహకే అందని ప్రి రిలీజ్ ప్రభంజనంతో మన ముందుకు వచ్చిన ఈ త్రిబుల్ ఆర్ ఆ అంచనాలు అందుకుందో లేదో ? చూద్దాం.
RRR స్టోరీ:
సింపుల్‌గా చెప్పాలంటే ఈ కథ 1920వ ప్రాంతానికి చెందింది. వేర్వేరు ప్రాంతాలకు చెందిన భీమ్ ( ఎన్టీఆర్ ) రామ్ ( రామ్ చరణ్ ) ఇద్దరూ కలిసి బ్రిటీష్ దొరలపై ఎలాంటి పోరాటం చేశారు ? అసలు వీరి అంతమ పోరాటం ఏంటి ? వీరు ఎలా ? స్నేహితులు అయ్యారు. వీరి నేపథ్యం ఏంటి ? వీరి పోరాటం నెరవేరిందా ? లేదా ? అన్నదే ఈ సినిమా స్టోరీ.
RRR విశ్లేషణ:
విశ్లేషణకు వస్తే తారక్ ఎంట్రీతో అసలు అడవిలో పులిని వేటాడే సీన్ చూస్తుంటే తారక్‌కు రాజమౌళిపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఎన్టీఆర్ కెరీర్‌రలోనే బెస్ట్ ఎంట్రీ సీన్‌గా ఈ సీన్ ఉందని చెప్పాలి. తారక్ తన అరివీర భయంకరమైన నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించేశాడు. అసలు పులితో ఫైట్ సీన్ వస్తుంటే ప్రేక్షకుడు థియేటర్లలో సీట్లలో కూర్చోకుండా లేచిపోయి కన్నారప్పకుండా తెరకు అతుక్కు పోయి చూస్తూ విజిల్స్ వేస్తూనే ఉంటాడు. రామ్‌చరణ్ ఇంట్రడక్షన్ ఫైట్ మగధీర సినిమాలోని 100 మందితో ఫైట్‌చేసే సీన్‌ను గుర్తుకు తెచ్చేలా ఉంది. రామ్‌చరణ్ యాక్షన్ సీన్లలో, లుక్స్ పరంగా చంపేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సినిమాపై అంచనాలు ఎక్కడికో తీసుకుపోయాడు. ఇక్కడ వచ్చే ట్విస్టులు ఊపిరి ఆడనీయవు.
సెకండాఫ్‌లో కొన్ని రొటీన్ సీన్ల తర్వాత సినిమా ఫ్రీ క్లైమాక్స్ నుంచి ఒక్కసారిగా స్పీడప్ అవుతుంది. అక్కడ నుంచి కంటిన్యూగా హై ఓల్టేజ్ సీన్లు, యాక్షన్లతో ఓ ఎక్స్‌ట్రార్డినరీ యాక్షన్ సీక్వెన్స్‌తో ముగస్తుంది. జక్కన్న సినిమాలో క్లైమాక్స్ ఎంత బలంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాను కూడా అంతే స్థాయిలో ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ముగించాడు. ఓవరాల్‌గా చెప్పాలంటే త్రిబుల్ ఆర్ అనేది జక్కన్న మార్క్ విజువల్ వండర్. పాటలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ అయితే అదిరిపోయాయి. అటు ఎన్టీఆర్‌తో పాటు రామ్‌చరణ్‌కు సమానంగా స్క్రీన్ ప్రెజన్స్ ఇస్తూ కథను బ్యాలెన్స్ చేస్తూ నడిపించిన తీరుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.
ఇద్దరు ఫ్యాన్స్‌ను మెప్పించేలా కథను ఈక్వల్ చేశాడు. క్లైమాక్స్‌లో చరణ్‌కు ప్రయార్టీ ఓ ఇంచ్ ఇచ్చాడా అనిపించింది. అయితే సెకండాఫ్లో మాత్రం కాస్త కథ స్లో అయ్యింది. కొన్ని రొటీన్ సీన్లు పడ్డాయి. అయినా ఎమోషన్స్ బాగా పండాయి. ఇక మిగిలిందంతా వాయింపుడే.. థియేటర్ బెంబేలెత్తిపోవాల్సిందే. రాజమౌళి మనకు ముందు చెప్పినట్టుగానే ఈ కథ మనకు తెలియంది కాదు.. స్వాతంత్య్ర పోరాటం, నైజాం పోరాటాల టైంలో జరిగిన ఇద్దరు విప్లవ స్వాతంత్య్ర వీరుల పోరాటం ఒకేసారి జరిగితే ఎలా ఉంటుందో అన్నది చూపించడంలోనే బ్లాక్‌బస్టర్ కొట్టేశాడు. ఈ రెండు పాత్రల చుట్టూ కథను నడిపించిన తీరుతోనే మన కడుపు చాలా వరకు నిండిపోతుంది.
అసలు వీళ్లు ఇద్దరు కలవడానికి.. సంఘర్షణ ఏర్పడడానికి సీన్లు రాసుకున్న తీరే అద్భుతం. ఆ తర్వాత బ్రిటీష్ వాళ్లపై వీళ్లిద్దరు కలిసి కట్టుగా పోరాటం చేసేందుకు కథను అల్లుకున్న తీరు కూడా గూస్ బంప్స్ తెప్పించేసింది. తారక్ – చరణ్ ఫ్రెండ్ షిఫ్ట్ బిల్డప్ చేసిన తీరు కథ అన్నీ కూడా ఓ టెంపోలో సాగుతాయి.
ఇలాంటి సినిమాకు బలమైన కథను ఎంచుకోవాలి. కానీ ఓ గోండు జాతి పిల్లను బ్రిటీష్ వాళ్లు ఎత్తుకు పోయారన్న కారణంతోనే ఇంత పెద్ద యుద్ధం చేయడం అన్నది చూస్తే చిన్న థ్రెడ్‌ను బాగా సాగదీసినట్టుగా ఉంది.
రాజమౌళి ఎలాంటి ట్విస్టులు లేకుండా నేరుగానే కథలోకి వెళ్లిపోయాడు. గోండు జాతి గిరిజన పిల్ల బ్రిటీష్ దొరసాని చేయికి బొమ్మ బాగా గీసిందని ముచ్చట పడి తీసుకుపోతారు. ఆ పిల్లను వెతుక్కుని కొమరం భీం ఢిల్లీ వెళతాడు. అయితే కొమరం భీంను పట్టుకునే పోలీస్ ఆఫీసర్‌గా అపాయింట్ అవుతాడు రామ్.
మంటల్లో చిక్కుకున్న పిల్లాడిని కాపాడే సీన్‌తోనే చరణ్, తారక్ కలుసుకుంటారు. అసలు ఈ సీన్ చూస్తేనే రోమాలు నిక్క పొడచుకుని ఉంటాయి. ఇక రామ్‌చరణ్ పాత్రలో సంఘర్షణకు ఎక్కువ స్కోప్ ఉంది.
ఓవీలియో మోరీస్‌తో తారక్ ప్రేమలో పడే సీన్ బాగుంది. ఇక తారక్ భీం పాత్ర అమాయకత్వంతో ఆకట్టుకుంటుంది. ఓవీలియాను ఆకట్టుకునేందుకు తారక్ పడే పాట్లు నవ్వుతో పాటు భావోద్వేగాలు కూడా కలిగిస్తాయి. నాటు నాటు సాంగ్‌కు ముందు తారక్‌ను బ్రిటీష్ డ్యాన్సర్స్ విషయంలో అవమానపరచడం.. ఆ వెంటనే వచ్చే నాటు సాంగ్ స్టెప్పులకు థియేటర్లలో ప్రతి ఒక్కరు డ్యాన్స్ మూమెంట్‌లోకి వెళ్లిపోతారు. అసలు ఈ సాంగ్, ఈ సాంగ్‌కు ముందు వచ్చే సీన్ మామూలుగా ఎంజాయ్ చేయరు. ఈ సాంగ్‌లో ప్రతి ఒక్క మూమెంట్‌ను ఎంజాయ్ చేయాల్సిందే.. థియేటర్లో అయితే ఈలలు, కేకలు ఆగలేదు. అయితే ఒక్క ఇంచ్ చెర్రీ స్టెప్స్ కంటే ఎన్టీఆర్ స్టెప్స్ కాస్త స్పీడ్‌గా ఉన్నాయి.
ఇక ఆలియా భట్ 187 నిమిషాల సినిమాలో ఆలియా 10 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. ఆమె పాత్ర ఐదారు సీన్లకు పరిమితం కావడం డిజప్పాయింట్. ఇక ఓవీలియె మోరిస్ తన క్యూట్‌లుక్స్ తో బాగా ఆకట్టుకుంది. ఇంగ్లీష్‌లో మాట్లాడడం.. తారక్ పై ఆమె చూపించే ప్రేమ .. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ సూపర్. ఆమె డ్రెస్ కోడ్ కూడా అప్పటి బ్రిటీష్ యువరాణిలను గుర్తు చేసింది. జెన్నీ పాత్రలో ఆమె అలా ఒదిగిపోయింది. నాటు నాటు పాటలో కూడా ఆమె తారక్ వేసిన స్టెప్పులకు ఫిదా అయిపోవడం సూపర్.
ఇక బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌దేవగన్, శ్రియా చరణ్‌లు ప్లాష్‌బ్యాక్‌లో చరణ్ తల్లిదండ్రులుగా కనిపిస్తారు. శ్రీయకు రెండు సీన్లు.. ఒక డైలాగ్ ఉంది. అజయ్ దేవగన్ పాత్రను బాగా చూపించినా.. కాస్త రొటీన్ అనిపించింది. సముద్రఖని పోలీస్ ఆఫీసర్‌గా తన పాత్రకు న్యాయం చేశాడు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఎనలైజింగ్ :
సినిమాటోగ్రఫీ: కెకె. సెంథిల్ కుమార్
సెంథిల్ సినిమాటోగ్రఫీ విజువల్స్ సూపర్. అసలు వంక పెట్టలేం. రాజమౌళి గత సినిమాలతో పోలిస్తే మాత్రం వెనకపడిందనే చెప్పాలి. ఇటీవల వచ్చిన రాధేశ్యామ్‌తో కంపేరిజన్ చేసినా ఎందుకో విజువల్స్ మరీ అంత గొప్పగా అయితే లేవు.
ఎడిటర్: శ్రీకర ప్రసాద్
శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్టాఫ్‌లో చాలా వరకు క్రిస్పీగానే ట్రిమ్ చేసినా సెకండాఫ్‌లో సెంటిమెంట్ సీన్లతో పాటు సెకండాఫ్‌లో కొన్ని సీన్లను ఓ 10 నిమిషాల పాటు ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత క్రిస్పీగా ముందుకు వెళ్లేదనిపించింది. సెకండాఫ్‌లో రామ్‌చరణ్ ప్లాస్‌బ్యాక్ సీన్లు మరింత కొత్తగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. అవి గతంలో కొన్ని సినిమాల్లో చూసినట్టుగానే ఉన్నాయి.
మ్యూజిక్: ఎంఎం. కీరవాణి
టెక్నికల్ విభాగంలో ప్రతి ఒక్క విభాగం బాగా ఎఫర్ట్ పెట్టాయి. కీరవాణి సంగీతం యాక్షన్, ఎమోషనల్ సీన్లలో మనస్సులను టచ్ చేసింది. పాటల విషయానికి వస్తే బాహుబలి సినిమాలోలా రొమాన్స్, లవ్ సాంగ్స్ కంటే సినిమాలో కలిసిపోయే పాటలే కావడంతో ఆడియోగా కంటే విజువల్స్ పరంగా హైలెట్ అయ్యాయి. కీరవాణి రాజమౌళి సినిమాలు అంటే ఎంత ఎఫర్ట్ పెట్టి పని చేస్తాడో.. ఎంతలా ప్రాణం పెడతాడో మరోసారి త్రిబుల్ ఆర్ చూస్తే తెలుస్తుంది.
స్టోరీ: విజయేంద్ర ప్రసాద్
ప్రతి సినిమాలోనూ బలమైన కథ రాసుకునే విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా విషయంలో కాస్త తడబడ్డాడు. ఇద్దరు పెద్ద హీరోలతో సినిమా తీయాలని ముందే ఫిక్స్ అవ్వడంతో కథ బలంగా లేదు. ఓ పిల్ల కోసం ఎన్టీఆర్, తండ్రి మాట కోసం చరణ్ అంతిమంగా కలిసి బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాటం చేసిన తీరే ఈ కథ.
మాటలు: సాయి మాధవ్ బుర్రా
బుర్రా సాయిమాధవ్ డైలాగులు అద్భుతం. రామ్‌చరణ్ – తారక్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లలో ప్రతి డైలాగ్ గుండెలను పిండేసేలా ఉంది. సాయిమాధవ్ గిరిజన గోండు భాషపై అధ్యయనం చేసి మరీ అక్కడ సంస్కృతి, అక్కడ ప్రజల జీవన విధానం ఎలా ఉంటుందో ? అదే స్టైల్లో డైలాగులు రాశారు. తారక్ – చెర్రీ మధ్య యాక్షన్ సీన్లు, ఎమోషనల్ సీన్లో వచ్చే డైలాగులే హర్ట్ టచ్చింగ్.
రాజమౌళి డైరెక్షన్:
రాజమౌళి సినిమాలు అంటేనే కథలో ఎప్పుడు దమ్ము ఉంటుంది. మంచి కథకు భారీ హంగులు జోడీంచి బ్లాక్‌బస్టర్ హిట్లు కొడుతూ వచ్చాడు. అయితే త్రిబుల్ ఆర్ విషయంలో మాత్రం ఆ లెక్క తప్పేసింది. ఓ బలహీన మైన కథ ఇంకా చెప్పాలంటే అదిలాబాద్ గోండు గిరిజన జాతి పిల్ల బ్రిటీష్ దొరసాని చేతికి బొమ్మ గీసి పాట పాడుతుంది. ఆ బొమ్మ బాగుందని ఆ పిల్లను వాళ్లు తీసుకుపోతారు. అడ్డొచ్చిన ఆ పిల్ల తల్లిని చంపేస్తారు. ఆ పిల్లను తిరిగి తీసకువచ్చేందుకు ఆ జాతిలో పులి లాంటి భీమ్ ఢిల్లీ వెళ్లి బ్రిటీషర్లపై పోరాటం చేసి ఆమెను తీసుకురావడం. కథలో మెయిన్ థ్రెడ్ అయితే ఇదే.
అటు రామ్‌చరణ్‌కు సైతం తండ్రికి ఇచ్చిన మాట కోసం బ్రిటీషర్లపై పోరాటం చేయడం.. విచిత్రం ఏంటంటే చివరగా చరణ్ ఎన్టీఆర్‌ను కూడా కలుపుకుని తన మాట నెరవేర్చుకుంటాడే కాని.. ఎన్టీఆర్ బలమైన లక్ష్యం ఏంటన్నది కనపడదు. అయితే ఇద్దరు హీరోలను సమాన పాత్రల్లో సమాన సీన్లలో చూపించేందుకు… ఒక్కో చోట ఎన్టీఆర్ ను కాస్త తగ్గించినట్టుగా ఉంది. ఇందుకు కారణం ఎన్టీఆర్ నటనతో డామినేట్ చేస్తాడన్న కారణం కూడా కావచ్చు. అయితే ఫస్టాఫ్‌లో ఉన్న టెంపో సెకండాఫ్‌లో తగ్గుతుంది.
ఓవరాల్‌గా ఎన్టీఆర్‌తో పాటు ఇటు చరణ్ ఇద్దరికి సమానంగా స్క్రీన్ ప్రజెన్స్ ఉండేందుకు ట్రై చేశాడు. ఎవ్వరి పాత్ర ఏ ఫ్రేమ్‌లోనూ ఏ మాత్రం తగ్గలేదు. అయితే ఎమోషనల్ సీన్లలో ఎన్టీఆర్ డామినేషన్ ఉందిరా అనుకోనేలొగానే వెంటనే చరణ్ సీరియస్ లుక్స్‌లో తాను డామినేట్ చేసేసేవాడు. అంతిమంగా ఇద్దరి పోరాటం బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాటమే అన్న కాన్సెఫ్ట్‌కూడా చక్కగా చూపించాడు.
ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అరాచకం.. అసలు రాజమౌళి ఎలా ప్లాన్ చేశాడు ? ఎన్ని రోజులు దీనిని షూట్ చేశారు ? ఈ ఆలోచనకే హ్యాట్సాప్ చెప్పాలి. అప్పటి వరకు కాస్త స్లోగా… కాస్త నత్తనడకతో వెళుతోన్న సినిమా కాస్తా ఒక్కసారిగా పీక్స్‌కు వెళ్లిపోయింది. పులులు, సింహాలను బ్రిటీష్ బంగ్లాలోకి తీసుకు వెళ్లే సీన్ అసలు మైండ్ పోయేలా ఉంది. సింహం వర్సెస్ పులి మధ్య పోరు అన్నట్టుగా ఉంది. చరన్, తారక్ ఇద్దరూ కూడా పోటీ పడి మరీ కొట్టుకున్నారు.
ప్లస్ పాయింట్స్ (+) :
ఎన్టీఆర్, చరణ్ నటన,
యాక్షన్ సన్నివేశాలు,
ఇంటర్వెల్ ముందు సన్నివేశం,
రాజమౌళి మార్క్ మేకింగ్.
కీరవాణి నేపథ్య సంగీతం
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ ( – ) :
హీరోయిన్ల పాత్రలు మరీ డమ్మీ అయిపోవడం..
సెకండ్ హాఫ్ కాస్త స్లో గా ఉంది.
బలమైన కథ లేకపోవడం
ఫైనల్‌గా…
మూడున్నర సంవత్సరాల ఉత్కంఠ… బాహుబలి ది కంక్లూజన్ తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడన్న నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. రాజమౌళి సినిమాలంటేనే అదిరిపోయే కథ… ఎన్నో మలుపులు.. ఊహించని మలుపులు ఉంటాయి. బాహుబలి సీరిస్ తర్వాత వచ్చిన ఈ సినిమా అదే అంచనాలతో వచ్చింది. మరి నిజంగా ఇది ఆ స్థాయి అంచనాలు అందుకుందా ? అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఓ వీక్ లైన్‌కు సాగదీసిన రాజమౌళి అదిరిపోయే విజువల్స్ వండర్‌తో మాత్రం మెస్మరైజ్ చేశాడు. దానయ్య ఖర్చు.. ఎన్టీఆర్ ఎమోషన్, రామ్‌చరణ్ సీరియస్ లుక్ ఇవన్నీ సినిమాను హిట్ చేశాయి. అయితే రాజమౌళి రేంజ్ మెస్మరైజ్ మాత్రం మిస్ అయ్యిందనే చెప్పాలి. బాహుబలి 2 రేంజ్ ఆశలతో కాకుండా మామూలుగా వెళితే సినిమాను సూపర్‌గా ఎంజాయ్ చేయోచ్చు.
బాటమ్ లైన్ :
అంచనాలు తప్పాయ్ కాని కలెక్షన్లు కుమ్మి కుమ్మి వదిలే బ్లాక్‌బస్టర్
RRR TL రేటింగ్: 4 / 5