మూడున్నర సంవత్సరాల తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ రాజమౌళి చెక్కిన శిల్పం త్రిబుల్ ఆర్ 24 గంటల తేడాలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్‌కు రెడీ అవుతోంది. రు. 500 కోట్ల భారీ బడ్జెట్.. అటూ ఇటూగా రు. 1000 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్.. ఒక్క హిందీ వెర్షన్.. అది కూడా ఇండియాలోనే 3200 స్క్రీన్లలో రిలీజ్.. ఓవర్సీస్‌లో 1100 స్క్రీన్లు.. ఏపీ, తెలంగాణలో అన్ని థియేటర్లలోనూ త్రిబుల్ ఆరే ఇలా చెప్పుకుంటూ పోతుంటే రిలీజ్‌కు ముందే త్రిబుల్ ఆర్ రికార్డులకు అంతే లేకుండా పోతోంది.
హైదరాబాద్‌లో నిన్నటికే కేవలం అడ్వాన్స్ బుకింగ్‌లతోనే ఈ సినిమాకు వచ్చిన గ్రాస్ వసూళ్లు రు 2.5 కోట్లు. ఒక్క సిటీలో మాత్రమే.. అది కూడా నిన్నటికి చాలా స్క్రీన్లు బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. ఇక ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్‌లతోనే 2 మిలియన్ డాలర్లు క్రాస్ చేసేసి.. 2.5 మిలియన్ డాలర్లకు చేరువ అవుతోంది. వామ్మో రిలీజ్‌కు ముందే ఈ ఊచకోత ఏంట్రా బాబు అని మహామహులే షాక్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే ఇంత పెద్ద భారీ సినిమా రిలీజ్ వేళ తెలుగు గడ్డపై ఎక్కడ చూసినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామాయే కనిపిస్తోంది. అనకాపల్లి టు హైదరాబాద్. అటు రాయచూర్, బళ్లారి, బెంగళూరు, అమెరికాలో ఏ సిటీలో చూసినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. పబ్లిసిటీతో మొదలు పెట్టి బెనిఫిట్ షోలకు టిక్కెట్లు సొంతం చేసుకోవడం.. కటౌట్లు, ఫ్లెక్సీలు కట్టడం ఎక్కడ చూసినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ దూసుకు పోతున్నారు.
చివరకు ఏపీలో పల్లెల్లోనూ ఇదే వాతావరణ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ సిటీలో తెల్లవారు ఝామున స్పెషల్ షోలు ప్లాన్ చేశారు. ఒక్క కూకట్‌పల్లి ఏరియాలోనే మొత్తం 6 షోలు వేస్తున్నారు. ఆ 6 షోలతోనే డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు కోటి రూపాయల వరకు వచ్చి ఉంటాయని అంటున్నారు. ఇటు మూసాపేట శ్రీరాములు, బోరబొండ విజేతలో కూడా స్పెషల్ షోలు ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ షోల టిక్కెట్లలో దాదాపుగా 80 నుంచి 90 శాతం టిక్కెట్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బుక్ చేసేసుకుంటున్నారు.
ఇక హడావిడి అంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌దే అయితే చరణ్ ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు ? అంటే వాళ్ల కంటే ముందే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్ని విషయాల్లోనూ స్పీడ్‌గా ఉండడంతో ఆ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మెగా అభిమానుల సంఘాల అధ్యక్షుడు రవణం స్వామినాయుడు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.
ఆయన ఆధ్వర్యంలో ఇదే కూకట్‌పల్లి బెల్ట్ లో రెండు షోలను ఫ్యాన్సీ రేటుకు తీసుకున్నట్టు చెపుతున్నారు. మరి బెనిఫిట్ షోల థియేటర్ల నిండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ హడావిడే ఉంటే బాగుండదనే మెగా ఫ్యాన్స్ వర్గాలు డైరెక్టుగా రంగంలోకి దిగాయని అంటున్నారు.