Moviesసినిమా అట్ట‌ర్‌ప్లాప్ భ‌యంపై రాజ‌మౌళి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సినిమా అట్ట‌ర్‌ప్లాప్ భ‌యంపై రాజ‌మౌళి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి పేరు ఇప్పుడు భారతీయ సినీ ప్రపంచంలో ఓ సంచలనం. అప్పుడు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మెగాఫోన్ పట్టిన రాజమౌళి తన 20 సంవత్సరాల కెరీర్లో అసలు అపజయం అన్న మాట లేకుండా సినిమా.. సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కాడు. ఈ రోజు భారతదేశం మాత్రమే కాదు.. ప్రపంచ సినిమా సైతం తన వైపు చూసే అంత గొప్ప దర్శకుడుగా ఎదిగారు. అందుకే దర్శక ధీరుడు బిరుదును సార్థకం చేసుకున్నాడు.

బాహుబలి ది బిగినింగ్ – బాహుబలి ది కంక్లూజన్ సినిమాలతో రాజమౌళి.. తెలుగు సినిమా ఖ్యాతిని కేవలం దేశం నలుమూలల విస్తరించడంతో పాటు ప్రపంచానికి చాటి చెప్పాడు. ఓ ప్రాంతీయ భాషా సినిమాగా తెరకెక్కిన బాహుబలి భారతదేశ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పింది. బాహుబలి సినిమా షూటింగ్ ప్రారంభించినప్పుడు తెలుగులో ఆడితే గొప్ప అనుకొన్నారు.. అలాంటిది కన్యాకుమారి నుంచి క‌శ్మీర్ వరకు బాహుబలి మానియాలో మునిగితేలే అంత గొప్పగా ఈ సినిమా రాజమౌళి తెరకెక్కించాడు.

ఇంకా చెప్పాలంటే దుబాయ్ – అమెరికా – యుకె – జపాన్ – మలేషియా – శ్రీలంక ఇలా ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కూడా బాహుబలి గురించి పెద్ద ఎత్తున చర్చ నడిచింది. విదేశాల్లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. రాజమౌళి రేంజ్ ఏంటో చెప్పడానికి పై ఉదాహరణలు చాలు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనూ ఎంత పెద్ద గొప్ప డైరెక్టర్‌కు అయినా ఏదో ఒక సందర్భంలో అపజయం ఎదురైంది. అయితే రెండు దశాబ్దాల రాజమౌళి కెరీర్లో ఇప్పటివరకు అపజయం అన్న మాటే లేదు.

ఇక రాజమౌళి తాజా సినిమా త్రిబుల్ ఆర్. టాలీవుడ్ లోనే తిరుగులేని క్రేజీ హీరోలుగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ … మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మల్టీ స్టారర్ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా ? అని మూడు సంవత్సరాలుగా అందరూ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ నెల 25న థియేటర్లలోకి దిగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇరవై రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ లు స్టార్ట్ చేస్తే మ‌లియ‌న్ మార్క్ వ‌సూళ్లు వచ్చాయి అంటే త్రిబుల్ ఆర్ హంగామా ఏ రేంజ్‌లో ఉందో అర్థం అవుతోంది.

ఇక దర్శకుడు రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్ల‌ను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఒక ప్రధాన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఫెయిల్యూర్ అన్న పదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఫెయిల్యూర్‌ భయం అన్నది పెద్ద కలలు కనేలా చేస్తుంది అని… తాను ఎప్పుడు ఏ సినిమా చేసినా అది నా ముందు సినిమా అంచనాలను మించి ఉండాలి అని… ఆ మ్యూజిక్ క్రియేట్ చేయాలన్న భయం నాకు చాలా ఉంటుంద‌ని.. ఈ భయమే తనను తాను మరింత మెరుగుపరచుకునేలా చేస్తుంది అని రాజమౌళి చెప్పారు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ ప్రధాన పాత్రను పోషించడంతో ఈ సినిమాపై మరింత అంచ‌నాలు పెరిగాయి. త్వరలోనే బెంగళూరులో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు రాజమౌళి చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news