తెలుగులో మల్టీస్టారర్లు చాలా తక్కువుగా వస్తూ ఉంటాయి. మహా అయితే ఆరేడేళ్ల నుంచి మాత్రమే కొద్దో గొప్పో మల్టీస్టారర్లు వస్తున్నాయి. సీనియర్ హీరో వెంకటేష్.. పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు, రామ్, వరుణ్‌తేజ్ లాంటి హీరోలతో మల్టీస్టారర్లు చేశాడు. ఇక పవన్ కూడా వెంకీతో పాటు రానాతో మల్టీస్టారర్ చేశాడు. బాహుబలిలో ప్రభాస్ – రానా కలిసి నటించారు. ఇక మెగా కాంపౌండ్‌లోనే పవన్ – సాయితేజ్, పవన్ – వైష్ణవ్ తేజ్ కాంబోలో సినిమాలు వస్తున్నాయి. పవన్ – బన్నీ కాంబోలో సినిమాకు కూడా ప్లానింగ్ జరుగుతోంది.
ఇలా మల్టీస్టారర్ సినిమాలు రావడం మంచి విషయం. ఎప్పుడో 1970 – 80 దశకంలో మాత్రమే ఇలాంటి మల్టీస్టారర్ సినిమాలు వచ్చేవి. మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో కాకపోయినా ఈ తరం జనరేషన్ హీరోలు ఈగోలను పక్కన పెట్టి మరో హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా వస్తోంది అంటే అందరూ ఖుషీగా ఉన్నారు. ఈ తరం జనరేషన్లో తిరుగులేని క్రేజీ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపై మామూలు అంచనాలు లేవు.
అయితే ఇప్పుడు సినిమా రిలీజ్‌కు ముందు భారీ ఎత్తున ప్రమోషన్లు జరుగుతోన్న వేళ ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ఫొటో చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి జెండా పట్టుకున నిల్చొన్న ఫొటో ఇది. అయితే ఈ ఫొటో బయటకు వచ్చిన వెంటనే ఫ్యాన్ ఎడిట్‌లు మొదలైపోయాయి. ముందు మెగా ఫ్యాన్స్ ఎన్టీఆర్‌ను తీసేసి కేవలం చరణ్ జెండా ఎత్తుతోన్న ఫొటో ఉండేలా ఎడిట్ చేశారు.
ఆ తర్వాత తారక్ ఫ్యాన్స్ దానికి రివర్స్‌లో చరణ్ ఫొటో తీసేసి తారక్ ఉండేలా ఫొటో ఎడిట్ చేశారు. తారక్ ఫ్యాన్స్ ఏం చెపుతున్నారంటే ఈ జెండా పట్టుకున్న విధానంలో పైన చరణ్ చేయి ఉందంటున్నారు. అక్కడ నుంచి డిస్కర్షన్లు స్టార్ట్ అయ్యాయి. మనదే పై చేయి.. కాదు మనదే పై చేయి అంటూ రకరకాలుగా ఇద్దరు హీరోల అభిమానులు ఆ పోస్టర్‌ను ఎడిట్ చేసుకున్నారు. చిన్న పోస్టర్ విషయంలోనే ఇంత వార్ నడుస్తుంటే రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఇద్దరు హీరోలను సమానంగా చూపించే విషయంలో ఏ చిన్న తప్పు దొర్లినా మరింత రచ్చ చేస్తారనడంలో సందేహం లేదు.
ఇదే ఇప్పుడు రాజమౌళికి పెద్ద సవాల్‌గా మారింది. ఇద్దరు హీరోలను ఆయన ఎలా ? బ్యాలెన్స్ చేసి చూపించాడన్నదే ఆసక్తి. ఎంత పెద్ద మల్టీస్టారర్.. ఎంత గొప్ప దర్శకుడు అయినా ఇలాంటి చిన్నా చితకా అంశాలను కూడా ఫ్యాన్స్ భూతద్దంలో పెట్టి చూడకూడదు. ఇలా చేయడం వల్ల అభిమానుల యుద్ధాలు చివరకు హీరోలను తాకుతాయి. అలాంటప్పుడు వాళ్లు మల్టీస్టారర్లు చేసేందుకు మాత్రం ఎందుకు ఇష్టపడతారు. ఈ విషయంలో అభిమానులు సంయమనం పాటించి.. కోడిగుడ్డు మీద ఈకలు పీకడం మానుకోవాలి.