సినీ ఇండస్ట్రీలో తనకంటూ.. ప్రత్యేక గుర్తింపు పొందిన ఎన్టీఆర్ తొలినాళ్లలో స్వయంగా.. ఆయనే సినిమా ల కోసం కష్టపడ్డారు. ఇది సహజం. ఇప్పుడు కూడా సినీ రంగంలో అవకాశాల కోసం.. ఎంతో మంది తిరుగు తున్నట్టుగానే అప్పట్లోనూ.. అప్పటి పరిస్తితులకు అనుగుణంగా ఉండేది. ఇలానే.. అన్నగారు.. అక్కినేని, మిక్కిలినేని..ఇలా అనేక మంది రూమ్ మేట్లుగా ఉంటూ.. సినిమా ఛాన్స్‌ల కోసం.. ఎదురు చూసేవారు. ఇలా.. సాగిన ప్రయాణం.. అన్నగారిని చాలా చాలా బిజీ చేసేసింది. ఎంతగా అంటే.. అసలు రూంకు వచ్చే టైం కూడా లేనంత వరకు.
ఒకానొక దశలో అన్నగారు.. స్టూడియోలోనే పడుకుని.. అక్కడే షూటింగులు చేసే స్థాయికి ఎదిగారు. ఇలాం టి సమయంలోనే మిస్సమ్మ సినిమాను అనుకున్నారు ప్రముఖ దర్శకులు.. ఎల్వీ ప్రసాద్. అన్నగారికి లైఫ్ ఇచ్చినవారిలో ఈయన చాలా ప్రముఖులు. ఎలాగూ.. ఎన్టీఆర్ తనవాడే అనుకున్న ఎల్వీ.. అన్నగారి ని ఊహించుకుని మిస్సమ్మ ప్రిపేర్ చేసుకున్నారు. సావిత్రి, జమున, అక్కినేని.. ఇలా.. వారి వారి పాత్రల కు తగిన విధంగా కథ వండేసుకున్నారు. అందరు యాక్టర్లూ.. ఓకే.. ఇక, ఇంకేముంది.. ఎన్టీఆర్‌ను పిలవడ మే తరువాయి.. అనుకున్నారు ప్రసాద్.
తాను చెబితే కాదనే వాడు కదా.. అనేది ఎల్వీ ప్రసాద్ ధైర్యం. కానీ, అనూహ్యంగా ఇక్కడే ఎన్టీఆర్ ప్లేట్ ఫిరాయించారు. మిస్సమ్మ సినిమా తాను చేయలేనని చెప్పారు. నిజానికి అప్పట్లో పారితోషికాలు ఉండేవి కాదు. విజయవాహిని స్టూడియోలో అన్నగారు రూ.120 (నెల జీతం) పనిచేసేవారు. ఏది చెబితే.. అది చేయాల్సిందే. కానీ, ఇదే సంస్థ నిర్మిస్తున్న మిస్సమ్మను మాత్రం చేయనన్నారట. అదేంటి? అనేది సంస్థ ప్రశ్న. దీనికి అన్నగారు.. చెప్పిన సమాధానం ఏంటంటే..“హీరోయిన్‌ను బ్రతిమాలుకోవడం ఏంటి ? ఇలాంటి పాత్రలు చేస్తే.. పేరు పోదూ..! అందుకే చేయను“ అని తెగేసి చెప్పారట.
ఇక. అప్పటి వరకు ఎన్టీఆర్ నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేసిన ఎల్వీ ప్రసాద్.. విషయం తెలుసుకుని.. “అలా కాదు.. ఈ సినిమా నీకు మంచి పేరు తెస్తుంది. నా మాట విను. బ్రతిమాలుకునే సీన్లే.. నీకు ప్రేక్షకుల్లో బ్రహ్మరథం పట్టిస్తాయి. నేను చెబుతున్నాగా..“ అని అన్నగారిని బ్రతిమాలుకున్నారట. తీరా సినిమా విడుదలయ్యాక చూడాలి.. అన్నగారికి ప్రేక్షకులు నిజంగానే బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా విజయవాడలో 365 రోజుల ఫంక్షన్ చేసుకుంది. ఇదీ.. మిస్సమ్మ సంగతి!