విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు.. తెలుగువారి నట వేల్పు.. అన్నగారు ఎన్టీఆర్ నట జీవితంలో ఎప్పుడు ఎలాంటి సమస్యా ఆయన ఎదుర్కోలేదు. ఆయనదంతా వన్ మ్యాన్ షో. అయితే అప్పుడప్పుడు పంటికింద రాయిలా.. కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటిదే ఒకటి ఎన్టీఆర్‌కు ఎదురైంది. అది ఛాలెంజ్ రాముడు మూవీ సమయంలో! ఆ సినిమాలో హీరోయిన్‌గా.. అన్నగారితో కలిసి యాక్ట్ చేశారు జయప్రద. అయితే.. ఆమె ఆరు అడుగుల పైనే ఎత్తు. అన్నగారు కూడా ఆరు అడుగులు ఆజానుబాహుడే.
అయినప్పటికీ.. అన్నగారి కంటే కూడా ఒక అంగుళం జయప్రద హైట్. అయితే.. నిర్మాత మాత్రం జయప్రదే కావాలని పట్టుబట్టారు. ఈ విషయం దర్శకుడు టీఎల్‌వీ ప్రసాద్ ఏం చేయాలో తెలియక తికమక పడ్డారు. దీంతో షూటింగ్ ప్రారంభించినా.. పాటలు.. హీరో .. హీరోయిన్ మధ్య జరపాల్సిన సీన్లను ఆయన వాయిదా వేస్తూ.. వచ్చారు. దీంతో విషయం తెలిసిన అన్నగారు.. ఏంటి మేటర్…? అని ఉదయాన్నే ఫోన్ చేశారట. దీంతో చెప్పలేక చెప్పలేక.. ప్రసాద్ విషయాన్ని అన్నగారికి వివరించారు.
దీంతో అన్నగారు వెంటనే రియాక్ట్ అయి.. దీనికి ఎందుకు ఇబ్బంది.. నేను చూసుకుంటాను..! అని ధైర్యం చెప్పారట. షూటింగ్ మొదలైంది. అన్నగారంటే.. అందరికీ హడల్. ముఖ్యంగా జయప్రదకు మరింత భయం. దీంతో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారట. ఈ సమయంలో హఠాత్తుగా అన్నగారు.. మడమ ఎత్తు ఎక్కువగా ఉన్న షూస్‌తో ప్రత్యక్ష మయ్యారు. వెంటనే “అమ్మాయ్ ఇలా రా!“ అని జయప్రదను పిలిచి.. `ఏదీ నాపక్కన నుంచో!` అని చెప్పారట.
దీంతో జయప్రద భయపడుతూనే.. అన్నగారి పక్కకు వెళ్లి నిలబడింది. “ఇప్పుడు చూచారా.. నేను రెం డు అంగుళాలు ఎత్తున్నా! మీకు అభ్యంతరం లేదుగా!“ అంటూ.. దర్శకుడు ప్రసాద్‌ను ప్రశ్నించారట… అన్నగారు. దీంతో హమ్మయ్య అని ప్రసాద్ ఊపిరి పీల్చుకున్నారట. అంతేకాదు.. కొన్ని కొన్ని సందర్భా ల్లో.. జయప్రద పక్కన పాటల సీన్‌లలో నటించేందుకు కొండలు.. గుట్టలు ఎంచుకునేవారట.
ఎత్తుగా ఉన్న ప్రాంతంలో ఆయన నిలబడి.. కొంత పల్లంగా ఉన్న ప్రాంతంలో జయప్రదను నిలబెట్టి సీన్‌లు తీసేవారట. ఈ విషయం.. చాలా రోజులు చర్చగా నడిచింది. అప్పట్లో ఇది సినిమా వర్గాల్లో ఓ హాట్ టాపిక్. తర్వాత తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో చాలా హిట్ సినిమాలు వచ్చాయి.