బాహుబలి 2 తర్వాత మళ్లీ చాలా రోజులకు ఓ తెలుగు సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీ ఇంఫాక్ట్ కలిగించే రేంజ్లో త్రిబుల్ ఆర్ రెడీ అవుతోంది. మూడేళ్ల నుంచి తెలుగు సినిమా జనాలనే కాకుండా భారతదేశ సినీ జనాలను ఎంతో ఊరిస్తూ వస్తోన్న ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా కర్నాటక ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఏకంగా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రావడంతో పాటు ఏకంగా ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూడాలని ఆయన పిలుపు ఇచ్చారంటేనే ఈ సినిమాపై ముఖ్యమంత్రులు సైతం ఎంత ఆసక్తితో ఉన్నారో అర్థమవుతోంది.
పైగా టాలీవుడ్‌లోనే క్రేజీ హీరోలుగా ఉన్న ఇద్దరు యంగ్‌స్టర్స్ మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటించిన సినిమా కావడంతో త్రిబుల్ ఆర్‌పై మామూలు అంచనాలు లేవు. అటు బాహుబలి ది కంక్లూజన్ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా ఇదే. ఇవన్నీ ఇలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ ఇరవై రోజుల క్రితమే స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లు క్రాస్ చేసిన ఈ సినిమా తాజాగా మరో అరుదైన రికార్డు బీట్ చేసినట్టు తెలుస్తోంది.
తాజాగా త్రిబుల్ ఆర్ 2 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టేసింది. ఈ క్రమంలోనే రిలీజ్‌కు ముందే బాహుబలి 2 రికార్డును కూడా బద్దలు కొట్టే ఛాన్సులు కూడా ఉన్నాయి. బాహుబలి 2 ఓవర్సీస్‌లో కేవలం ప్రీ రిలీజ్ బుకింగ్స్ ద్వారానే 2.45 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పుడు త్రిబుల్ ఆర్ రిలీజ్‌కు మరో నాలుగు రోజుల టైం ఉన్న వేళ బాహుబలి 2 రికార్డులు బీట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే 2 మిలియన్ డాలర్లు రాబట్టడంతో మరో .45 డాలర్లు రాబడితే బాహుబలి 2 రికార్డు కూడా బీట్ అయినట్టే అవుతుంది. ఓవరాల్‌గా అక్కడ రు. 65 కోట్లకు త్రిబుల్ ఆర్ రైట్స్ అమ్ముడుపోయాయి. సినిమాకు హిట్ టాక్ వస్తే చాలా సులువుగానే ఆ మొత్తం వస్తుందని ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు. మరి త్రిబుల్ ఆర్ త్రయం ఏం చేస్తుందో ? ఈ నెల 25న తేలిపోనుంది.