తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాల క్రితం మల్టీస్టారర్ సినిమాలు చేసేవారు. ఎన్టీఆర్ – ఏఎన్నార్ – సూపర్ స్టార్ కృష్ణ – శోభన్ బాబు – కృష్ణంరాజు – చిరంజీవి లాంటి స్టార్ హీరోలు కలిసి నటించే వారు. అప్పట్లో హీరోల మధ్య ఎంత పోటీ ఉన్నా కథ డిమాండ్ చేస్తే మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు ఏమాత్రం వెనకడుగు వేసేవారు కాదు. అయితే 1990 తర్వాత హీరోల ఇమేజ్ మారిపోయింది. మార్కెట్ పెరిగింది. అభిమానుల మధ్య పోటీతత్వం ఎక్కువవడంతో మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు హీరోలు ఆసక్తి చూపించలేదు. హీరోల మధ్య పోటీ ఎక్కువగా ఉండడంతో ఎవరికి వారే ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయి సొంత మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డారు.
అయితే గత ఆరేళ్లుగా మాత్రం టాలీవుడ్లో పరిస్థితి మారుతోంది. స్టార్ హీరోలుగా ఉన్న వారు కలిసి నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విక్టరీ వెంకటేష్.. పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు – రామ్‌తో కలిసి సినిమాలు చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ – చిరంజీవి కలిసి ఆచార్య సినిమా చేస్తున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ లలో సినిమాలు వస్తే చూడాలని ప్రేక్షకులు ఎన్నో కలలు కంటూ ఉంటారు. అయితే అలాంటి కాంబినేషన్లు కొన్ని కారణాలతో ఎప్పటికీ నెరవేరి పరిస్థితులు కనపడవు.
తెలుగులో స్టార్ హీరో లాగా ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో సినిమా ఊహించగలమా ? అసలు అది జరిగే పనేనా అంటే.. ఎవరిని అడిగిన కచ్చితంగా జరగదు అని అంటారు. బాలయ్య – చిరంజీవి కలిసి నటిస్తే బాక్సాఫీస్ దద్దరిల్లిపోతోంది. అయితే గతంలో చిరంజీవి – బాలయ్య తండ్రి దివంగత నందమూరి తారక రామారావుతో కలిసి నటించారు. 1990వ దశకం తర్వాత ఇద్దరు నెంబర్ వన్ హీరో ర్యాంక్ కోసం పోటీ పడడంతో ఎవరి దారులు వారివి అయ్యాయి.
అయితే ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమాలో నటించారు అన్న విషయం ఈ తనం జనరేషన్లో చాలా తక్కువ మందికి మాత్రమే తెలియదు. ఆ సినిమా పేరు త్రిమూర్తులు. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఒక పాటలో ఇద్దరు మెరిశారు. వీరిద్దరితో పాటు నాగార్జున – శోభన్ బాబు – కృష్ణతో పాటు పలువురు హీరోలు కనిపించారు. ఆ తర్వాత వెంకటేష్ నటించిన చింతకాయల రవి సినిమాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక పాటలో తళుక్కున మెరిసి రెండు మూడు స్టెప్పులు వేసి మాయమవుతాడు.