పోసాని కృష్ణమురళీ తెలుగులో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.. అంతకుమించి ఓ కమెడియన్, ఓ విలన్.. పోసానిలో మంచి రచయిత, మంచి దర్శకుడు కూడా దాగి ఉన్నాడు. పోసాని ఇండస్ట్రీలో మూడు దశాబ్దాల నుంచి కొనసాగుతున్నారు. పోసాని సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ కొనసాగారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో చేరిన ఆయన గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరి జగన్ వాయిస్ వినిపిస్తున్నారు.
పోసాని వైసీపీ వాయిస్ వినిపించే క్రమంలో పవన్ కళ్యాణ్‌పై అప్పుడప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే ఆయన తాజాగా తనకు పవన్ అంటే వ్యక్తిగతంగా కోపం లేదని.. వైసీపీపై విమర్శలు చేసేటప్పుడు అందులో నిజం ఉంటే తాము స్వీకరిస్తామని చెప్పారు. తాను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కొందరు చిరంజీవి ఫ్యామిలీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే తాను టీవీలో గంటన్నర పాటు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసే వారికి ఘాటైన కౌంటర్లు ఇచ్చానని పోసాని చెప్పారు.
అరగంట పాటు మాట్లాడాలని టీవీ ఛానెల్‌కు వెళితే అది ఏకంగా గంటన్నర పాటు కొనసాగింది అని.. ఎవ్వరూ కూడా మెగా ఫ్యామిలీని చిన్న మాట అనకుండా వాళ్లకు సమాధానం చెప్పానని.. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం చెప్పడంతో పాటు ఆ ఫ్యామిలీపై ఎవ్వరూ చిన్న ఈగ వాలకుండా చూశానని నాటి సంఘటన గుర్తు చేశారు. ఆ చర్చ తర్వాత సాయిధరమ్ తేజ తల్లి తనకు ఫోన్ చేసి పోసాని గారు మీరు మా కుటుంబ గొప్పతనం గురించి.. చాలా బాగా మాట్లాడారు.. ఎన్నికల్లో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా వాటికి సరైన సమాధానం చెప్పారని మెచ్చుకున్నారట.
అలాగే అప్పుడు పవన్ కళ్యాణ్ భార్య రేణుదేశాయ్ సైతం పోసానికి ఫోన్ చేసి పోసాని గారు మీరు టీవీలో మాట్లాడుతుంటే పవన్ గారు చాలా టెన్షన్ పడ్డారు.. ఎవ్వరూ కూడా మా ఫ్యామిలీపై నోరు జారకుండా మీరు మాట్లాడారు.. చాలా థ్యాంక్స్ అని చెప్పిందని పోసాని చెప్పారు.