పవర్‌స్టార్ పవన్ కళ్యాన్ నటించిన భీమ్లానాయక్ సినిమా మరో 24 గంటల్లో థియేటర్లలోకి రానుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ పండగ చేసుకునేందుకు రెడీ అవుతోన్న వేళ ఏపీ సర్కార్ పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ పెద్దలు వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి వచ్చారు. ఇప్పటికే టిక్కెట్ల రేట్ల పెంపుపై జీవో వస్తుందనే అందరూ అనుకున్నారు. కేవలం ఈ ప్రయోజనం భీమ్లానాయక్‌కు కలగకూడదన్న ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు టిక్కెట్ రేట్ల పెంపు జీవో జారీ చేయలేదని పవన్ అభిమానులు ఆరోపిస్తున్నారు.
ఇదే పెద్ద షాక్ అనుకుంటే ఈ రోజు ఏపీ ప్రభుత్వం మరో పెద్ద షాక్ ఇచ్చింది. భీమ్లానాయక్ ప్రదర్శించే ఎగ్జిబిటర్లతో ఈ రోజు ఏపీ ప్రభుత్వం తరపున అధికారులు భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాత రేట్లకే టిక్కెట్లు అమ్మాలని.. కొత్త రేట్లు అమలు చేసినా, టిక్కెట్ రేట్లు పెంచినా కూడా కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. అవసరం అయితే థియేటర్లు మూసివేస్తామన్న వార్నింగ్‌లు కూడా ఇవ్వడంతో ఎగ్జిబిటర్లు భయపడిపోతున్నారు. ఇప్పటికే తాము భారీ రేట్లకు ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేశామని.. ఇలాంటి టైంలో పాత రేట్లకు అమ్మితే తమకు కనీస పెట్టుబడులు కూడా రావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అలాగని ఎవ్వరూ నోరెత్తే పరిస్థితి లేదు. ఇక ఏపీలో బెనిఫిట్ షోలు కూడా ఉంటాయన్న గ్యారెంటీలు అయితే లేవు. భీమ్లానాయక్‌ను ఏపీ ప్రభుత్వం ఇంతలా టార్గెట్ చేయడంతో పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే భీమ్లానాయక్‌కు తెలంగాణ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసింది. నైజాం ఎగ్జిబిటర్ దిల్ రాజు కోరిక మేరకు రెండు వారాల పాటు అంటే వచ్చే 11వ తేదీ వరకు రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అంటే రెండు వారాల పాటు అదనంగా మరో షో వేసుకోవచ్చు.
ఇక ఇప్పటికే అక్కడ టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఉన్నాయి. అక్కడ ముందు రోజు అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఓవరాల్‌గా ఈ సినిమాకు తెలంగాణలో ఎంత గుడ్ న్యూస్ ఉందో.. ఏపీలో అంత బ్యాడ్ న్యూస్ ఉంది. ఇక ఐదో షోకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేయడంతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలకు సైతం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ రోజు జరిగే ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు సైతం తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరు అవుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే నైజాంలో మాత్రం ప్రభుత్వం ఎంత రెడ్ కార్పెట్ వేసిందో అర్థమవుతోంది.
ఏపీ ప్రభుత్వం ఇదే విధంగా టార్గెట్ చేస్తే ఈ సినిమా కొన్న వాళ్లు, థియేటర్లలో ప్రదర్శించే వాళ్లకు భారీ నష్టాలు అయితే తప్పవనే అంటున్నారు. దగ్గుబాటి రానా మరో హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు సాగర్ కె. చంద్ర డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సంభాషణలు సమకూర్చారు. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.