లెజెండ్రీ సింగర్, భారత గానికోకిల లతా మంగేష్కర్ తన 92 ఏళ్ల వయస్సులో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె ముంబైలోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతికి కారణం ఏంటన్నది ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు. కొద్ది వారాల ముందు వరకు ఆమె యాక్టివ్‌గానే ఉన్నారు. ఇంతలోనే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. లతాజీకి న్యూమోనియో ఉందని.. దానికి తాము చికిత్స చేస్తున్నామని… దీనికి తోడు కరోనా సోకడంతో పరిస్థితి విషమించి ఆమె మృతి చెందారని అంటున్నారు.
అయితే ఆమె మరణానికి వీటితో పాటు మరో కారణం కూడా ఉంది. ఆమె శరీరంలో మల్టిఫుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యాయట. ఆమె శరీరంలో పలు అవయవాలు పనిచేయని స్థితికి చేరుకున్నాయి. అది కూడా ఆమె మృతికి మరో కారణమైందని వైద్యులు చెపుతున్నారు. లతాజీ ఆదివారం ఉదయం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఆమె వెంటిలేటర్‌పై ఉండగానే గత నెల 28న ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు చెప్పారు. ఆమెను వెంటిలేటర్‌పై నుంచి కూడా తొలగించారు. అయితే శనివారం మళ్లీ ఆరోగ్యం విషమించడంతో ఆమెను వెంటిలేటర్‌పైకి మార్చారు. శరీరంలోని అవయవాలు పనిచేయకపోవడంతో పాటు స్పందించకపోవడంతోనే ఆమె మరణం సంభవించిందని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.
లతాజీ మృతితో పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ – ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ – రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు లతాజీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.