సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాలలో బాషా ఒకటి. నగ్మా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు సీనియర్ డైరెక్టర్ సురేష్‌కృష్ణ దర్శకత్వం వహించారు. అంతకుముందు సురేష్‌కృష్ణ చెప్పిన కథ రజనీకాంత్‌కు నచ్చలేదు. దీంతో పవర్ ఫుల్ య్యాక్షన్ ప్యాక్ స్టోరీ రెడీ చేసుకురమ్మని చెప్పి సురేష్‌కృష్ణను పంపించారు. ఆ తర్వాత సురేష్‌కృష్ణ చెప్పిన కథ రజనీకాంత్‌కు పిచ్చపిచ్చగా నచ్చేసింది. అలా వచ్చిన ఆ సినిమా రజనీకాంత్ కెరీర్‌కే ఓ టర్నింగ్ పాయింట్‌గా మారింది.
ఈ సినిమాలో రజనీకాంత్ చెప్పిన బాషా ఒక్కసారి చెపితే వందసార్లు చెప్పినట్టు అన్న డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఈ డైలాగ్ ఇప్పటకీ ఎవరికి వారు తమ మాట ఎంత స్ట్రాంగో చెప్పేందుకు వాడుతూనే ఉంటారు. ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. రజనీకాంత్ డైలాగులు, స్టైల్, మేనరిజమ్‌కు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు.
అయితే ఈ సినిమా తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ కావాల్సి ఉంది. ఈ సినిమా కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయ్యిందని తెలిసిన వెంటనే చిరు బావమరిది, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రీమేక్ రైట్స్ కోసం అక్కడ ముందుగా సంప్రదింపులు చేశారు. బాషా నిర్మాతలు రు. 40 లక్షలు ఇస్తేనే రైట్స్ ఇస్తామని చెప్పారట. అయితే అరవింద్ రు. 25 లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా బాషా నిర్మాతలు ఒప్పుకోలేదు.
అప్పట్లో రు. 40 లక్షలు అంటే చాలా ఎక్కువే. అయితే అంత మొత్తం పెట్టి రీమేక్ రైట్స్ కొని. మళ్లీ ఇక్కడ సినిమాగా చేసేందుకు ఎందుకో గాని అరవింద్ ధైర్యం చేయలేదు. దీంతో బాషా నిర్మాతలు ఆ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగులో భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. చిరంజీవి ఈ సినిమాను చేసి ఉంటే ఆయన ఇమేజ్ ఆ టైంలో మరెక్కడికో వెళ్లిపోయి ఉండేది.