ఇటీవల కాలంలో మోహన్‌బాబు సన్ ఆఫ్ ఇండియా సినిమాకు సోషల్ మీడియాలో జరిగినంత నెగిటివ్ ట్రోలింగ్ మరే సినిమాకు జరిగి ఉండదు. ఇటీవల బాలయ్య అఖండ సినిమాకు ఎంత పాజిటివ్‌గా సోషల్ మీడియాలో ట్రెండింగ్ జరిగిందో ఈ సినిమాకు అంతకు అంత డబుల్ నెగిటివ్ ట్రోలింగ్ సోషల్ మీడియాలో జరిగింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది.
సినిమాపై ఉన్న దారుణమైన అంచనాలు నిజం చేస్తూ ఈ సినిమాకు తొలి రోజే డిజాస్టర్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాకు తొలి రోజు వచ్చిన వసూళ్లు చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయి. రిలీజ్‌కు ముందు రోజు అడ్వాన్స్ బుకింగ్‌లు పెడితే కేవలం రెండంటే రెండు టిక్కెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. ఇక తొలి రోజు వసూళ్లు చూస్తే కేవలం రు. 6 లక్షలు మాత్రమే రాబట్టిందట. అది కూడా గ్రాస్ అంటున్నారు. ఈ లెక్కన నెట్ వసూళ్లు చూస్తే ఇంకా చాలా తక్కువగానే ఉండొచ్చు.. లేదా మైనస్ నష్టాల్లోకి వెళ్లిపోవచ్చు.
ఇక తొలి రోజే ప్రేక్షకులు లేక వందలాది షోలు క్యాన్సిల్ చేసేశారు. కొన్ని చోట్ల థియేటర్లకు రెంట్ ఖర్చులు రావని ఒక్క షో కూడా వేయకుండానే సినిమాను లేపేశారు. నటుడిగా, నిర్మాతగా, విలన్‌గా మోహన్‌బాబు ఇండస్ట్రీలో 40 ఏళ్ల నుంచి ఉంటున్నారు. ఆయన ఇద్దరు వారసులు కూడా హీరోలుగా ఉన్నారు. కలెక్షన్‌కింగ్‌గా ఎదిగారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన సినిమాకు ఇంత ఘోర అవమానం ఎదురైంది అంటే అందుకు కారణాలు ఏంటన్నది ఆయన విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.
మోహన్‌బాబు అంటే ఒకప్పుడు ఇండస్ట్రీకి భయం.. అదంతా గతం. ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం.. యువతరం.. ఈ జనరేషన్ వేరు. మంచు ఫ్యామిలీలో మోహన్‌బాబు, విష్ణు మాటలు తూలడంతో పాటు వారి అతే వారి ఫ్యామిలీ మైనస్‌కు కారణం అవుతోంది. ఇక మా ఎన్నికలు, సినీ రాజకీయ పరమైన వ్యాఖ్యలు వంటివి ఈ ట్రోల్స్ కి ప్రధాన కారణాలు. మోహన్‌బాబు ఫ్యామిలీకి ఫ్యాన్స్ బేస్ లేదు. ఇక ఇటీవల అతి అంటేనే మోహన్‌బాబు ఫ్యామిలీ.. మోహన్‌బాబు ఫ్యామిలీ అంటేనే అతి అన్న ప్రచారం కూడా ఎక్కువ అయయింది. ఇవన్నీ ఆ ఫ్యామిలీ హీరోల సినిమాలు ప్రజలు చూసేందుకు కూడా ఇష్టపడకుండా ఉండేందుకు ప్రధాన కారణాలు అవుతున్నాయి.