కోలీవుడ్ సీనియర్ హీరో సూర్యను, దర్శకుడు మురుగదాస్‌ను ఓవరాల్‌గా సౌత్ ఇండియా అంతటా పాపులర్ చేసిన సినిమా గజినీ. ఈ సినిమాలో కథ, కథనాలతో పాటు దానికి సూర్య అవుట్ స్టాండింగ్ పెర్పామెన్స్, హరీష్ జైరాజ్ మ్యూజిక్ ఇవన్నీ కలిపి గజినీ సినిమాను ఇండియాలోనే ఓ క్లాసిక్ సినిమాగా నిలిపాయి. ఆ సినిమా వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా ఇప్పటకీ టీవీల్లో చూస్తుంటే ఏదో కొత్త ఫీలింగ్ మనకు కనపడుతూ ఉంటుంది. ఇక ఈ సినిమా పట్టాలు ఎక్కడం వెనక చాలా కథే నడిచింది.
12 మంది హీరోలు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. చివరకు ఈ కథ అటు ఇటూ తిరిగి వచ్చి సూర్య చేతిలో పడింది. విజయ్‌కాంత్‌తో రమణ ( తెలుగులో ఠాగూర్) సినిమా తీసిన తర్వాత మురుగదాస్‌కు స్టార్ డైరెక్టర్ హోదా వచ్చింది. రమణ తర్వాత తీసిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత తీసే సినిమా కూడా అంతే విభిన్నంగా ఉండాలని మురుగదాస్ అనుకున్నారు. హాలీవుడ్‌లో వచ్చిన మూవీ మమెంటో లైన్ బేస్ చేసుకుని ఓ కథ రాసుకున్నారు. 2003 నుంచి ఈ కథను పట్టుకుని హీరోల దగ్గరకు వెళ్లడం మొదలు పెట్టారు.
ఇక తెలుగు నిర్మాతల దగ్గరకు కూడా మురుగదాస్ వచ్చారు. సురేష్‌బాబుకు ఈ కథ చెపితే ఆయన తన బ్యానర్లో ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. ఇది రిస్కీ కథ కదా ? ఏ హీరో చేస్తాడు అని ఆయన అడిగితే మహేష్‌బాబు అయితే బాగుంటుందని కూడా మురుగదాస్ సురేష్‌తో అన్నారు. మహేష్‌ను కలిసి కథ చెపితే బాగుందని.. తనకు సూట్ కాదని రిజెక్ట్ చేశారు. చివరకు వెంకటేష్‌తో చేయాలని ప్లాన్ చేశారు.
అయితే గుండు గెటప్ చేసేందుకు వెంకటేష్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత అల్లు అరవింద్‌ను కలిపి పవన్ కళ్యాణ్‌తో చేయాలని అనుకున్నారు. అయితే అప్పటికే జానీ ప్లాప్‌తో ఉన్న పవన్ ఈ సినిమాపై అస్సలు ఆసక్తి చూపలేదు. ఇక తెలుగు హీరోలను వదిలేసి తమిళ హీరోల వెంట పడ్డాడు మురుగదాస్. అక్కడ కమల్‌హాసన్ నో చెప్పాడు. విజయ్ వద్దన్నాడు. ఇలా 10 మంది హీరోలు ఈ కథను వద్దనడంతో మురుగదాస్ చివరకు ఈ కథను పక్కన పెట్టేయాలని అనుకున్నాడు.
ఆ టైంలో అనుకోకుండా అజిత్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. హీరోయిన్‌గా ఆశిన్, సెకండ్ రోల్లో శ్రియా, విలన్గా ప్రకాష్‌రాజ్‌ను అనుకున్నారు. యువన్ శంకర్‌రాజా మ్యూజిక్. 2004 మార్చిలో షూటింగ్ స్టార్ట్.. మిరథల్ టైటిల్‌గా పెట్టారు. ఆశిన్‌తో ఫొటో షూట్ అయ్యింది. 15 రోజుల షూటింగ్ తర్వాత నిర్మాతతో గ్యాప్ రావడంతో అజిత్ సడెన్‌గా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో నిర్మాతలు మాధవన్‌తో తీయాలని అనుకున్నారు. ముందు ఓకే చెప్పినా తర్వాత మాధవన్ కూడా ఎస్కేప్ అయ్యాడు. చివరకు నిర్మాతలు ఆ సినిమా నుంచి తప్పుకున్నారు.
చివరకు ఈ సినిమా ఎలాగైనా చేయాలన్న మురుగదాస్ కసి మరింత పెరిగింది. అలా ఆ కథతో సూర్యను కలిసి ఒప్పించాడు. సూర్య ఓకే చెప్పాడు. ఆశిన్, నయనతార హీరోయిన్లు.. హరీష్ జైరాజ్ మ్యూజిక్. గజినీ కోలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్.. తర్వాత తెలుగులోనూ సూపర్ హిట్. తర్వాత ఆమీర్‌ఖాన్ ముచ్చటపడి మురుగదాస్‌ను మెచ్చుకుని హిందీలో చేశాడు. హిందీలో అల్లు అరవింద్ నిర్మాత. అక్కడ బ్లాక్‌బస్టర్. ఇలా ఈ సినిమా ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అవ్వడంతో పాటు మురుగదాస్‌కు ఎప్పటకీ తిరుగులేని క్రేజ్‌ను తెచ్చిపెట్టింది.