సినిమా రంగంలో స్టార్ హీరోలు, హీరోయిన్లుగా ఉన్న వారిలో చాలా మంది తమ అసలు పేరు కంటే సినిమాలలో పాపులర్ అయిన పేర్లతోనే ఎక్కువగా పిలవబడుతూ ఉంటారు. సినిమాల్లోకి వచ్చాక వాళ్లకు ఉన్న ఇమేజ్ ను బట్టి అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఏదో ఒక బిరుదు తగిలించేస్తాయి. దీంతో సదరు హీరో లేదా హీరోయిన్ అసలు పేరు కంటే అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఆ పేరుతోనే ఎక్కువగా పాపులర్ అవుతారు. సీనియర్ హీరోలు చిరంజీవి మెగాస్టార్ గా…. బాలకృష్ణ నటసింహంగా… నాగార్జున కింగ్‌గా.. వెంకటేష్ విక్టరీ బిరుదుతో… ఆ తర్వాత తరం స్టార్ హీరోలు ఎన్టీఆర్ యంగ్ టైగర్ గా – అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా – రామ్ చరణ్ మెగా పవర్ స్టార్‌గా – మహేష్ బాబు సూపర్‌స్టార్‌గా పాపులర్ అయ్యారు.
ఇక సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ విషయానికి వస్తే టాలీవుడ్లో దివంగత లెజెండ్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినిమాల్లోకి వచ్చారు. తండ్రి నిర్మాతగా ఆకాశ శిఖరాలను అందుకుంటే… వెంకటేష్ అందుకు భిన్నంగా హీరోగా తనదైన ముద్ర వేసుకున్నారు. నాటి నుంచి నేటి వరకు ఫ్యామిలీ సినిమాల హీరోగా గుర్తింపు పొందిన వెంకటేష్ తన కెరీర్లో 70 శాతానికి పైగా విజయాలు సొంతం చేసుకున్నారు. సినిమాల్లోకి వచ్చి వరుస విజయాలు సొంతం చేసుకోవడంతో వెంకటేష్ కు అభిమానులు ముద్దుగా విక్టరీ అన్న బిరుదు ఇచ్చారు.
దీంతో వెంకటేష్ విక్టరీ వెంకటేష్ అయిపోయారు. అయితే వెంకటేష్ అసలు పేరు దగ్గుబాటి వెంకటేశ్వర్లు. ఇది వెంకటేష్ తాతగారి పేరు. రామా నాయుడు గారికి తండ్రి మీద, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి మీద ఉన్న భక్తితో ఈ పేరు పెట్టారు. వెంకటేష్ అంటే చిన్నప్పటి నుంచి రామానాయుడు గారి ఇంట్లో ఎంతో గారం చూపించేవారు. ఇక చెన్నైకి వచ్చాక స్కూల్లో జాయిన్ అయినప్పుడు కొన్ని కారణాలవల్ల స్కూల్ రికార్డుల్లో వెంకటేశ్వర్లు కాస్త వెంకటేష్ గా మారింది. అయితే వెంకటేష్ కు తన అసలు పేరు అంటే ఎంతో ఇష్టం.
ఈ క్రమంలోనే తన సినిమాల్లో ఏ మాత్రం అవకాశం వచ్చినా వెంకటేశ్వర్లు పేరుతో నటించారు. విచిత్రమేంటంటే వెంకటేశ్వర్లు పేరుతో నటించిన సినిమాలు అన్ని ఆయనకు విజయాన్ని అందించాయి. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మేనకోడలు నీరజను పెళ్లాడిన వెంకటేష్‌కు ముగ్గురు కుమార్తెలు.. ఓ కుమారుడు ఉన్నారు.