నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్కు స్క్రిప్ట్ పరంగా ప్రముఖ రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్‌స్టాపబుల్ విజయవంతం అయ్యింది… ఈ షోకు తిరుగులేని ఆదరణ వచ్చింది. ఈ షోను విజయవంతం చేసిన వారిలో రవి కూడా ఉన్నారు. సీజన్ వన్‌లో ఎపిసోడ్ లు అన్ని హైలైట్ అయ్యాయి. అయితే బాలయ్య షోకు మాస్ మహారాజా రవితేజ రావడం పెద్ద సంచలనం అయింది. దీనికి ప్రధాన కారణం గతంలో బాలకృష్ణ – రవితేజకి మధ్య ఒక హీరోయిన్ కారణంగా గొడవ జరిగిందని… అందువల్ల ఇద్దరి మధ్య మాటలు లేవు అన్న ప్రచారం కొంతకాలంగా ఉంది. అయితే అదంతా పుకార్లు మాత్రమేనని… కొందరు డాష్ గాళ్లు.. పని పాట లేకుండా ఇలాంటివి ప్రచారం చేస్తున్నారంటూ ఈ షో వేదికగా రవితేజ – బాలయ్య క్లారిటీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే బీవీఎస్ రవి ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య – రవితేజ గొడవల గురించి స్పందించాడు. రవితేజతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని… రెండు రోజులకు ఓ సారి ఆయనతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటానని… అలాంటిది నాకే ఈ విషయం తెలియదంటే..ఇది ఎంత అబద్ధమో తెలుస్తోందని చెప్పారు. ఇక బాలయ్య – రవితేజ చాలా సార్లు కలుసుకున్నారని.. చాలా క్లోజ్‌గా మాట్లాడుకున్నారని కూడా రవి చెప్పారు. చిరు బర్త్ డే ఫంక్షన్లో ఇద్దరు కలిసి డ్యాన్సులు వేశారని.. యూరప్‌లో సినిమాల షూటింగ్ టైంలో కూడా కలుసుకున్నారని రవి చెప్పారు.
ఇక ఆహా కార్యక్రమానికి రవితేజను బాలయ్య రానివ్వడని ప్రచారం జరిగిందని.. అయితే రవితేజను గెస్ట్‌గా పిలవాలని అనుకున్నప్పుడు రవికి కాల్ చేయనా ? ఆయన నెంబర్ నా దగ్గర ఉందని బాలయ్య అన్నారని రవి గుర్తు చేసుకున్నారు. అయితే రవితేజ బిజీ షెడ్యూల్‌తో ఉన్నాడని.. బాలయ్య షో కావడంతో ఎప్పుడు వస్తాను అనే ఆప్షన్ మాత్రం తనకు వదిలి పెట్టాలని రవితేజ రిక్వెస్ట్ చేశాడని రవి తెలిపారు. చివరకు ఈ ఎపిసోడ్ బాగా పేలడంతో పాటు తన గురించి ఎవరేమనుకున్నా ఆ షోలో రవితేజను డీల్ చేసిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు.
ఈ ఎపిసోడ్లో బాలయ్య రవితేజను ఓ ప్రశ్న అడిగారు. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే నీ మీద డ్రగ్స్ కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. రవితేజను ఇబ్బంది పెట్టాలని అనుకుంటే బాలయ్య ఇదే ప్రశ్న మరోలా వేసి ఉండేవారు.. కానీ బాలయ్య మనస్తత్వం ఏంటి ? ఆయనకు ఎవరితోనూ ఎలాంటి విబేధాలు ఉండవు ? అనేందుకు ఆయన ప్రశ్న వేసిన తీరే నిదర్శనం.