సినిమా ఇండస్ట్రీలో విజయాలు, అపజయాలు అనేది కామన్. స్టార్ హీరోలు.. స్టార్ దర్శకుల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాయి. సినిమా రిలీజ్ కు ముందు ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టేస్తుందనే అందరూ అనుకుంటారు. తీరా సినిమా రిలీజయ్యాక తుస్సు మనిపిస్తుంది. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవుతాయి. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఒక సినిమా తొలిరోజు నెగిటివ్ టాక్ తెచ్చుకుంది అయితే ఫైనల్‌గా బాక్సాఫీస్ పూర్తయ్యేసరికి కమర్షియల్‌గా హిట్ సినిమాగా నిలిచింది.
ఆ సినిమా ఏదో కాదు ఎన్టీఆర్ కెరీర్ లో 25వ సినిమా నాన్నకు ప్రేమతో. వన్ లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత సుకుమార్ ఈ సినిమాను రూపొందించారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. సీనియర్ హీరోలు రాజేంద్రప్రసాద్, జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. తండ్రి సెంటిమెంట్‌తో పాటు రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది.
ఈ సినిమా ప్రీమియర్ షోలు కంప్లీట్ అయిన వెంటనే చాలా క్లాస్‌గా ఉందని… ఎన్టీఆర్ ఇమేజ్‌కు ఏమాత్రం సూట్ కాలేదన్నా టాక్ తెచ్చుకుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం దర్శకుడు సుకుమార్ పై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. తొలి రోజు సాయంత్రానికే సినిమా ప్లాప్ అని చాలామంది తేల్చేశారు.. అసలు సుకుమార్ లాజిక్‌లు జనాలకు అర్థం కాలేదని పెదవి విరిచారు. అదే సంక్రాంతికి నాన్నకు ప్రేమతో సినిమాకు పోటీగా బాలకృష్ణ డిక్టేటర్ – నాగార్జున సోగ్గాడే చిన్నినాయన – శర్వానంద్ ఎక్స్ప్రెస్ రాజా సినిమాలు వచ్చాయి.
దీంతో ఈ సినిమాలు పోటీలో నాన్నకు ప్రేమతో ఘోరమైన ప్లాప్ అవుతోందని ట్రేడ్ వర్గాలు కూడా లెక్కలు వేశాయి. అయితే నాన్నకు ప్రేమతో రెండో రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర మెల్లగా పుంజుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ బాగా ప్రమోషన్ చేశారు. క్లాస్ ప్రేక్షకులతో పాటు ఓవర్సీస్ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా బాగా నచ్చింది. చివరకు రు. 54 కోట్ల షేర్ రాబట్టిన సినిమా అద్భుత విజయం సొంతం చేసుకుంది. అందరూ ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కు క్లాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన అభిమానం పెరిగింది.