నటరత్న ఎన్టీఆర్ – అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. శ్రీదేవి చిన్నప్పుడు ఓ సినిమాలో ఎన్టీఆర్‌కు మనవరాలి పాత్రలో నటించారు. ఆ తర్వాత ఆమె హీరోయిన్ అయ్యాక అదే ఎన్టీఆర్ పక్కన హీరోయిన్‌గా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు. ఇక శ్రీదేవి తండ్రి కొడుకులు అయిన ఏఎన్నార్, నాగార్జున పక్కన కూడా నటించారు. అలా టాలీవుడ్‌లో తండ్రి, కొడుకుల పక్కన హీరోయిన్‌గా చేసిన ఘనత శ్రీదేవికి దక్కింది.
అలాగే నటరత్న ఎన్టీఆర్‌తో చేసిన శ్రీదేవి ఆయన తనయుడు యువరత్న బాలకృష్ణతో మాత్రం నటించలేదు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కించాలని అనుకున్నా అటు ఎన్టీఆర్‌తో శ్రీదేవి చేసి ఉండడంతో బాలయ్యతో ఆమె చేస్తే బాగోదన్న టాక్ రావడంతో ఆ కాంబినేషన్ పట్టాలు ఎక్కలేదు. ఇక వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ నటభూషణ్ శోభన్ బాబు, నటసింహం బాలకృష్ణ కాంబినేషన్లో అశ్వమేధం సినిమా నిర్మించారు.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1992లో రిలీజ్ అయ్యింది. అశ్వనీదత్ చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా తర్వాత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో ముందుగా బాలయ్య పక్కన శ్రీదేవిని హీరోయిన్‌గా అనుకున్నారు. అదే సమయంలో అశ్వనీదత్ నిర్మించిన గోవిందా గోవిందా సినిమాలో కూడా ఆమె హీరోయిన్‌గా నటించింది. అందుకే బాలయ్య పక్కన కూడా ఆమెనే హీరోయిన్‌గా పెట్టాలని అనుకున్నారు.
అయితే ఈ తర్వాత ఈ ప్రాజెక్టులోకి హీరోయిన్లుగా నగ్మా, మీనా హీరోయిన్లుగా వచ్చారు. ఈ సినిమా షూటింగ్ 1992 జూన్ 29న స్టార్ట్ అయ్యింది. నాగార్జున కెమేరా స్విచ్ఛాన్ చేస్తే, చిరంజీవి క్లాప్ ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైంది. శోభన్‌బాబు పోలీస్ ఆఫీసర్ అభిమన్యుగా, ఆయన తమ్ముడు పైలెట్ ఆఫీసర్ బాలయ్యగా నటించాడు.
అమ్రిష్ పురి, రాధారవి, కోట శ్రీనివాసరావు విలన్లు. ఈ సినిమాకు సంగీతం అందించిన ఇళయరాజా ముంబై నుంచి స్పెషల్‌గా ఓ టీంను రప్పించి మరీ రీ రికార్డింగ్ చేశారు. 1992 డిసెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. రు. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నా.. అవి అందుకోలేదు. ఆ రోజుల్లో 8 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది.