ఇప్పుడు హీరోల రెమ్యునరేషన్లు పెరిగిపోయాయి. ఒక సినిమా హిట్ అయితే చాలు… ఆ సినిమా కలెక్షన్లు చూపించి.. దర్శకులు, హీరోలు అమాంతం రెమ్యునరేషన్లు పెంచేస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలకు ఒక సినిమాకు రు. 10 లక్షలు రెమ్యునరేషన్ ఇస్తే వామ్మో అని ముక్కున వేలేసుకునేవారు. 1990వ దశకం నుంచి క్రమక్రమంగా హీరోల రెమ్యునరేషన్లు పెరిగిపోతూ వస్తున్నాయి. ఇక ఇప్పుడు డిజిటల్ యుగం కావడంతో పాటు శాటిలైట్, ఓటీటీ రైట్స్, ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ అంటూ నిర్మాతలకు నాలుగైదు రకాల ఆదాయాలు రావడంతో దొరికిందే అదనుగా హీరోలు కూడా సినిమా సినిమాకు రేట్లు పెంచుకుంటూ పోతున్నారు.
ఇక ఇప్పుడు మనం వింటోన్న రెమ్యునరేషన్లు చూస్తే పుష్ప 2కు బన్నీకి రు. 75 కోట్లు, ప్రభాస్ ఒక్కో పాన్ ఇండియా సినిమాకు రు. 100 కోట్లు, మెగాస్టార్ చిరంజీవికి ఒక్కో సినిమాకు రు. 50 నుంచి రు. 60 కోట్లు, సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు కూడా ఒక్కో సినిమాకు రు. 60 కోట్లు అని అంటున్నారు. ఇక 1980లో స్టార్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్‌స్టార్ కృష్ణ లాంటి వాళ్లు ఎంతెంత రెమ్యునరేషన్లు తీసుకున్నారో ? తెలుసుకుందాం.
ఎన్టీఆర్:
అప్పట్లో ఎన్టీఆర్‌తో సినిమా చేయాలంటే రు. 40 లక్షలు బడ్జెట్ అయ్యేది. అదే సెట్స్ వేసి.. కాస్త భారీగా తీయాలంటే మరో రు. 10 లక్షల వరకు ఎక్కువ అయ్యేది. అందులో ఎన్టీఆర్ రెమ్యునరేషన్ రు. 12 లక్షలుగా ఉండేది. అయితే అందుకు తగ్గట్టే వసూళ్లు కూడా ఎన్టీఆర్ సినిమాలకు ఉండేవి. ఎన్టీఆర్ సినిమాలు అప్పట్లోనే రు. కోటి నుంచి రు. 3 కోట్ల వరకు వసూళ్లు రాబట్టేవి. అప్పట్లో సౌత్ ఇండియాలో ఎన్టీఆర్‌దే హయ్యస్ట్ రెమ్యునరేషన్.
ఏఎన్నార్:
అప్పట్లో ఏఎన్నార్ సాంఘీక సినిమాలకు బడ్జెట్ రు. 30 కోట్లు ఉండేది. అందులో రు. 10 లక్షలు ఆయన రెమ్యునరేషన్ ఉండేది.
కృష్ణ:
సూపర్‌స్టార్ కృష్ణ అప్పట్లో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండేవారు. ఆయన సినిమా బడ్జెట్ 20 నుంచి 25 లక్షల వరకు ఉంటే అందులో ఆయన 7 లక్షల రెమ్యునరేషన్ ఉండేది. అయితే తన సినిమా ప్లాప్ అయ్యి.. నిర్మాతలకు నష్టాలు వస్తే వెంటనే అదే నిర్మాతలకు కృష్ణ డేట్లు ఇచ్చి మరో సినిమా చేసి పెట్టేవారు. అందుకే కృష్ణను నిర్మాతల హీరో అనేవారు.
శోభన్‌బాబు:
ఫ్యామిలీ ఆడియెన్స్‌కు అప్పట్లో బాగా కనెక్ట్ యిన శోభన్‌బాబు సినిమాల బడ్జెట్, రెమ్యునరేషన్ దాదాపు కృష్ణ సినిమాలకు సమానంగా ఉండేవి. శోభన్‌బాబు సినిమా బడ్జెట్ 20 లక్షలు అయితే అందులో 6-7 లక్షలు రెమ్యునరేషన్ గా తీసుకునేవాడు.