Newsగ్యాంగ్‌లీడ‌ర్ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ వేరు.. హీరో వేరు.. మీకు...

గ్యాంగ్‌లీడ‌ర్ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ వేరు.. హీరో వేరు.. మీకు తెలుసా…!

మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు విజయబాపినీడు కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ వేరు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. మాస్‌ సినిమాలను తనదైన స్టైల్లో తెరకెక్కించ‌డంలో విజయబాపినీడు చాలా స్పెషల్. వీరిద్దరి కాంబినేషన్లో పట్నం వచ్చిన పతివ్రతలు – మగమహారాజు – మగధీరుడు – హీరో – ఖైదీ నెంబర్ 786 – గ్యాంగ్ లీడర్ – బిగ్‌బాస్ సినిమాలు తెరకెక్కాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలకు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాతగా ఉన్నారు.

అప్పట్లో శ్యాం ప్రసాద్ బ్యానర్లో చిరంజీవి – విజయబాపినీడు కాంబినేషన్ లో వచ్చిన సినిమాలకు తిరుగులేని క్రేజ్ ఉండేది. విజయ బాపినీడు తన కెరీర్లో తెరకెక్కించిన 22 సినిమాల్లో ఎక్కువగా చిరంజీవితోనే తీశారు. వీరి కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాల కంటే గ్యాంగ్‌లీడర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 1991లో శ్యాంప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి – విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు బప్పిలహరి సంగీతంతో పాటు ప్రభుదేవా కొరియోగ్రఫీ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.

అయితే ఈ సినిమా గురించి తెరవెనక కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అప్పటికే చిరంజీవితో అనేక హిట్ సినిమాలను తెరకెక్కించిన విజయబాపినీడు చిరంజీవి తమ్ముడు నాగబాబు హీరోగా ఒక సినిమా తీయాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే హీరో ఎలివేషన్స్ తో కూడిన ఒక మంచి ఫ్యామిలీ స్టొరీని రెడీ చేసుకున్నారు. అరె ఓ సాంబ అనే టైటిల్ ఖరారు చేసి ఆ కథని నాగబాబుకు వినిపించారు.

అయితే నాగబాబు ఆ కథ తన కంటే చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కు బాగా సూట్ అవుతుందని చెప్పారు. దీంతో ఆ కథలో కొన్ని మార్పులు చేసి చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాగా తెరకెక్కించారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news