నందమూరి బాలకృష్ణ – బి గోపాల్ కాంబినేషన్‌కు రెండు దశాబ్దాల క్రితం తిరుగులేని క్రేజ్ ఉండేది. వీరిద్దరి కాంబినేషన్లో ఐదు సినిమాలు వస్తే నాలుగు సినిమాలు ఇండస్ట్రీ హిట్లు అయ్యాయి. 1999 సంక్రాంతి కానుకగా వచ్చిన సమరసింహా రెడ్డి సినిమా 77 కేంద్రాల్లో 100 రోజులు ఆడటంతో పాటు అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. 2001 సంక్రాంతి కానుకగా వచ్చిన నరసింహనాయుడు అయితే భారతదేశ సినీ చరిత్రలో 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన తొలి సినిమాగా రికార్డులకు ఎక్కింది. నరసింహనాయుడు 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
కామవరపుకోట చరిత్రలో తొలి శతదినోత్సవం :
ఈ క్రమంలోనే ఈ సినిమా అప్పట్లో చిన్న చిన్న పల్లెటూరులో సైతం లక్షలాది రూపాయలు వసూలు చేసి పెను సంచలనానికి కారణమైంది. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట శ్రీ లక్ష్మీ టాకీస్ లో నరసింహ నాయుడు 101 రోజులు ఆడి చరిత్రకెక్కింది. ఒక చిన్న మండల కేంద్రం అయిన కామవరపుకోట సినిమా చరిత్రలో నరసింహ నాయుడు తొలి రిలీజ్ సినిమా. ఈ సినిమాకు సూపర్ డూపర్ హిట్ టాక్ రావడంతో నెల రోజులకు పైగా టికెట్లు దొరకని పరిస్థితి. విచిత్రమేంటంటే ఏలూరు అంబికా కాంప్లెక్స్ లో రెండు థియేటర్లలో ఈ సినిమా ఆడుతున్నా అక్కడ టికెట్లు దొరకని వాళ్ళు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామవరపుకోట వచ్చి సినిమా చూసి వెళ్లేవారు.
నెల రోజుల పాటు నాలుగు షోలు హౌస్‌ఫుల్ తో నరసింహనాయుడు సినిమా నడిచింది. అలా విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కూడా ఈ సినిమాకు మరింత హిట్ టాక్ రావడంతో విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇన్ని దశాబ్దాల కామవరపుకోట సినిమా చరిత్రలో ఈ సెంటర్లో 100 రోజులు ఆడిన ఏకైక సినిమాగా నరసింహనాయుడుకు చెక్కుచెదరని రికార్డు సొంతం అయ్యింది. ఈ ధియేటర్ నిర్వాహకులు కోటగిరి వేణుబాబు కోటగిరి కిషోర్ బాబు ( దివంగత మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు సోదరుని కుమారులు) బాలయ్యకు వీరాభిమానులు.
అప్పట్లో కామవరపుకోట లాంటి చిన్న సెంటర్లలో సినిమా రిలీజ్ అవ్వడం అంటే కష్టం. అయితే అప్పుడు మంత్రిగా ఉన్న విద్యాధరరావు రికమండేషన్ చేయడంతో ఏలూరు శ్రీ వల్లి పిక్చర్ వారు కామవరపుకోటలో నరసింహ నాయుడు రిలీజ్ ప్రింట్ ఇచ్చేందుకు అంగీకరించారు. నరసింహానాయుడు సినిమా ఈ చిన్న పల్లెటూరులో వంద రోజులకు 11 లక్షలకు పైగా వసూళ్లు రాబట్టింది. అప్పట్లో ఇది ఓ సంచలనం అయింది. ఈ సినిమా ఇక్కడ సాధించిన వసూళ్లు ఆ సినిమా నిర్మాతలతో పాటు బాలయ్య దృష్టికి వెళ్లడంతో వారు సైతం హర్షం వ్యక్తం చేశారు.
ఆ తర్వాత ఇదే లక్ష్మీ టాకీస్ లో 2004 సంక్రాంతి కానుకగా బాలయ్య నటించిన లక్ష్మీ నరసింహ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా అర్థ శతదినోత్సవం జరుపుకుంది. అలా కామవరపుకోట సినీ చరిత్రలో ఒక శతదినోత్సవం – ఒక అర్థ శతదినోత్సవం ఉన్న ఏకైక హీరోగా బాలయ్య చరిత్ర పుటలలో నిలిచి పోయాడు.