పాత తరం హీరోయిన్లలో అటు అందంతో పాటు ఇటు అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు కె ఆర్ విజయ. కెఆర్.విజయ తెలుగులో అప్పటి తరం సీనియర్ హీరోలు అందరితోనూ నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. భక్తి రస చిత్రాలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించాలంటే అప్పట్లో కె.ఆర్.విజయకు మాత్రమే సాధ్యం అయ్యేది. ఆమె అసలు పేరు దేవనాయకి. కేరళలోని త్రిసూర్ లో ఫిబ్రవరి 19, 1947 న జన్మించారు.
ఆమె తండ్రి తెలుగు వ్యక్తి. ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా. కె.ఆర్.విజయ ఆమె తల్లిదండ్రులకు పెద్ద కుమార్తెగా జన్మించారు. విజయకు మొత్తం నలుగురు చెల్లెలు… ఒక తమ్ముడు ఉన్నారు. కేరళలోని త్రిస్సూర్ లో విద్యాభ్యాసం చేసిన ఆమె… తన తండ్రి మంచి నటుడుతో పాటు కళాభిమాని కావడంతో ప్రముఖ నటుడు రాధాకృష్ణ డ్రామా కంపెనీలో దేశభక్తి నాటకాలు ప్రదర్శిస్తూ వుండేవారు.
తండ్రిని చూసిన కె.ఆర్.విజయకు నటన పట్ల ఆసక్తి కలిగింది. ఈ క్రమంలోనే ఆమె తన 17వ యేటనే తమిళ దర్శక, నిర్మాత కె ఎస్ గోపాలకృష్ణ అమర జ్యోతి పథకం మీద నిర్మించిన కర్పగం సినిమాలో మొదటి సారిగా నటించారు. ఆ తర్వాత 1964లో గోపాలకృష్ణన్ ఓ సినిమా నిర్మించారు. ఆ సినిమా నిర్మాత వేలాయుధన్ సుదర్శన్ చిట్‌ఫండ్ కంపెనీ యజమాని. ఆ సినిమాలో శివాజీ గణేషన్‌తో పాటు సావిత్రి కూడా నటించారు.
ఆ సినిమా షూటింగ్ టైంలో కేఆర్. విజయకు, వేలాయుధన్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి.. ఆ తర్వాత వారు రహస్యంగా వివాహం చేసుకున్నారు. వారు ఓ సారి కొలంబో రహస్య యాత్రకు వెళ్లారు. అప్పుడు కొందరు ఓ ఫొటో తీసి బయట పెట్టడంతో వీరిద్దరి బంధం అందరికి తెలిసిపోయింది. అప్పటి వరకు ఉన్న రూమర్లు నిజం అని తేలిపోయాయి.
విజయ భర్త వేలాయుధన్ తెలుగు, మళయాళ భాషల్లో 60కు పైగా సినిమాల్లో నటించారు. తన భర్త సహకారంతో 100కు పైగా సినిమాలు చేశారు. ఇప్పుడు కూడా ఆమె తల్లి, భామ్మ పాత్రల్లో నటిస్తూనే ఉన్నారు. బాలయ్య సింహా సినిమాలో ఆయనకు బామ్మగా నటించారు. ఇక కేఆర్. విజయ భర్తకు ఖరీదైన ఆస్తులు ఉన్నాయి. అప్పట్లోనే ఓడలతో పాటు బెంగళూరులో ఖరీదైన హోటల్స్, ఇతర ఆస్తులు గట్టిగా ఉండడంతో విజయ తల్లిదండ్రులు కూడా ఈ వివాహానికి అడ్డు చెప్పలేదని అంటారు.
అయితే అప్పటికే వేలాయుధన్‌కు పెళ్లయ్యి శారద, విలసిని అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. కేఆర్. విజయ ఆయనకు మూడో భార్య. అప్పట్లోనే ఆయనకు సొంత విమానం ఉండేది. కేఆర్. విజయ – వేలాయుధన్ ఆ విమానంలోనే యాత్రలకు చక్కెర్లు కొట్టేవారు. ఈ దంపతులకు హేమలత అనే కుమార్తె జన్మించింది. పెళ్లి తర్వాత కేఆర్. విజయ సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నా భర్త నిర్మాత కావడంతో ఆయన ప్రోత్సాహంతో తర్వాత సినిమాల్లో నటించారు.