ఏఆర్. మురుగదాస్ కోలీవుడ్‌కు చెందిన ఆయన ఇప్పుడు దేశంలోనే స్టార్ డైరెక్టర్లలో ఒకరు. అసలు మురుగదాస్ ఎంచుకునే కథలే పిచ్చెక్కించేస్తాయి. గజనీ సినిమాతో యావత్ దేశాన్ని తన వైపునకు తిప్పేసుకున్నాడు. సౌత్‌లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్ హీరోగా తెరకెక్కించి అక్కడ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. మురుగదాస్ ఈ రోజు స్టార్ డైరెక్టర్‌గా ఉన్నా ఆయన కెరీర్‌లో ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారట. ఆయన తండ్రి పేరు అరుణాచలం.. ఆయన రోజువారి కూలి. ఆ డబ్బులతోనే కుటుంబాన్ని పోషించేవారట.
మురుగదాస్ చిన్నప్పటి నుంచే పుస్తకాలు పురుగు. అలాగే సినిమాలు చాలా ఇష్టంగా చూసేవాడట. అప్పట్లో డబ్బులు లేక నేల టిక్కెట్లు తీసుకుని మరీ సినిమాలు చూసేవాడట. తిరుచ్చిలో బీఏ పూర్తి చేసిన మురుగదాస్ అలా సినిమాల్లోకి రావాలని చెన్నై చెక్కేశాడట. చెన్నై వెళ్లినప్పుడు కూడా డబ్బులు లేకపోవడంతో ప్రతి నెలా ఇంటి నుంచే రు. 500 పంపేవారట. ఒక్కోసారి రోజుకు ఒక్క పూట మాత్రమే తింటూ అలా కొన్ని నెలల పాటు గడిపాడట.
ఒక్కోసారి ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేకపోతే స్నేహితుల దగ్గరకు వెళ్లి బట్టలు ఉతికే పనిచేసేవాడట. ఒక ప్యాంటు, చొక్కా ఉతికినందుకు రూపాయి తీసుకునేవాడట. అయితే మురుగదాస్ చేస్తోన్న పని చూసిన ఇంటి ఓనర్ నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే అద్దె ఇవ్వు.. ఆ పనిమానేయమని బతిమిలాడడంతో మురుగదాస్ బట్టలు ఉతికే పని మానేశాడట.
చివరకు మురుగదాస్ అద్దెకు ఉంటోన్న ఇంటి ఓనర్ సాయంతో అమృతమని రైటర్ వద్ద పనిలో చేరాడట. అతడి దగ్గర ఎన్నో సినిమాలకు పనిచేశాడు. అలా సినిమా రంగంలో రచయితగా నిలదొక్కుకున్నాక డైరెక్టర్ ఎస్.జె. సూర్య దగ్గర వాలి, ఖుషి సినిమాలకు పనిచేశాడు. అలా హీరో అజిత్‌తో మంచి పరిచయం పెరిగింది.
వాస్తవానికి గజనీ సినిమాను ముందు అజిత్‌తో చేయాలని అనుకున్నాడు. అప్పుడు అజిత్ డేట్లు ఖాళీ లేకపోవడంతో అప్పుడు సూర్యతో చేసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఆ సినిమా హిట్ అయ్యాక మురుగదాస్ తిరుగులేని క్రేజీ డైరెక్టర్ అయిపోయాడు.