యువరత్న నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఎంత స్టార్ హీరోగా ఉన్నా కూడా ఆయన ఫ్యామిలీ ఎప్పుడూ బాలయ్య సినిమా విషయాల్లో ఏనాడు జోక్యం చేసుకోరు. అసలు సినిమా ఫంక్షన్లకు కూడా వారు ఎప్పుడూ రారు. బాలయ్య భార్య వసుంధర అఖండ సినిమా షూటింగ్ చివరి రోజు మాత్రమే వచ్చారు. బాలయ్య – వసుంధర దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు తేజస్విని, బ్రాహ్మణితో పాటు కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. బాలయ్య ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు ఇప్పటికే అయ్యాయి.
బాలయ్య పెద్ద కుమార్తె బ్రాహ్మణి భర్త టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తన మేనత్త కొడుకునే బ్రాహ్మణి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవించి ఉన్నప్పుడే బ్రాహ్మణి, లోకేష్‌కు పెళ్లి చేస్తే బాగుంటుందని తరచూ అనేవారట. ఎన్టీఆర్ మరణాంతరం నిజంగానే వీరి పెళ్లి జరుగుతుందా ? అన్న చిన్న డౌట్ కొందరిలో ఉండేది. అయితే బాబు భార్య భువనేశ్వరి మాత్రం తన తండ్రి కోరిక మేరకు బ్రాహ్మణీయే తన కోడలు కావాలని పట్టుబట్టడంతో 2007లో వీరి పెళ్లి జరిగింది.
ఇక బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని వైజాగ్ గీతం వారి కోడలు అయ్యింది. తేజస్విని భర్త మొతుకుమిల్లి శ్రీభరత్ ఇద్దరు రాజకీయ ఉద్దుండుల మనవడు. ఇటు కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు కూతురు కుమారుడు. అటు మరో మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తికి మనవడు. గతంలో ఎంవీవీఎస్ మూర్తి ఎన్టీఆర్‌తో ఓ సందర్భంలో మీ నందమూరి కుటుంబంతో వియ్యం అందుకోవాలని ఉందని అనేవారట.
ఎన్టీఆర్ మరణాంతరం ఈ విషయం ఎవ్వరూ పట్టించుకోలేదు. 2007లో లోకేష్ – బ్రాహ్మణి పెళ్లిలో మూర్తి తేజస్వినిని చూశారట. ఆ టైంలో మూర్తి నందమూరి కుటుంబంతో వియ్యం గురించి చెప్పాలనుకునేందుకు కాస్త వెనకడుగువేసేవారట. అందుకు కారణం తన మనవడు భరత్ మరో తాత కావూరు సాంబశివరావు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నారు.
అయితే బాలయ్య వైపు నుంచే పెళ్లి ప్రతిపాదన అటు వెళ్లడంతో మూర్తి ఆనందానికి అవధులు లేవట. గతంలో మీ నాన్న గారు ఉండగానే నందమూరి కుటుంబంతో వియ్యం అందుకోవాలని ఉందని అన్నానని.. ఆ మాట ఇప్పుడు నిజం అవుతోందని ఆయన ఆనంద పడ్డారట. అలా తేజస్విని – భరత్ వివాహం జరిగింది. ఏదేమైనా బాలయ్య తన ఇద్దరు కూతుళ్లకు తిరుగులేని సంబంధాలు కుదిర్చారు.