ఫ్యామిలీ హీరోలకు కేరాఫ్ అయిన సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. గత 20 ఏళ్లలో వెంకటేష్ చేసినన్ని ఫ్యామిలీ సబ్జెక్ట్‌లు ఏ హీరో చేయలేదు. అలాగే వెంకీ అంటేనే రీమేక్ సినిమాలకు కేరాఫ్. వెంకటేష్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో చంటి సినిమా ఒకటి. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఎస్. రామారావు ఈ సినిమాను నిర్మించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకీ పక్కన మీనా హీరోయిన్. సీనియర్ హీరోయిన్ సుజాత వెంకీకి తల్లిగా నటించారు.
ఈ సినిమాలో సెంటిమెంట్‌తో పాటు సాంగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1992 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోలీవుడ్‌లో ప్రభు హీరోగా దర్శకుడు పి. వాసు డైరెక్ట్ చేసిన చిన్నతండి సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని.. రవిరాజా పినిశెట్టిని దర్శకుడిగా అనుకున్నారు. ఇక హీరోగా రాజేంద్ర ప్రసాద్ పేరుతో పాటు మరికొన్ని పేర్లు పరిశీలించారు.
అయితే ఈ సినిమా గురించి వెంకీ అన్న సురేష్‌బాబుకు తెలిసింది. ఈ సినిమాను వెంకటేష్‌తో చేస్తే ఎలా ఉంటుందని నిర్మాత రామారావును అడిగారు. ఆయన డేట్లు ఇస్తే నేను చేయడానికి సిద్ధం అని చెప్పడంతో వెంటనే సురేష్‌బాబు ఇన్వాల్ అయ్యి వెంకీ డేట్లు ఇచ్చేలా చేశారు. దీంతో ఆ సినిమా వెంకటేష్‌తో తెరకెక్కింది. చంటి పాత్రలో నటించేందుకు వెంకీ చాలా కష్టపడ్డాడు.
ఈ సినిమా రిలీజ్ అయ్యాక వెంకీ ఇమేజ్ బాగా పెరిగిపోయింది. హీరోయిన్ మీనాకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. కోలీవుడ్‌లో హిట్ అయిన చిన్నతంబి సినిమా కంటే కూడా చంటి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. బ్యాడ్ లక్ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాను మిస్ అయ్యారు. ఆ హిట్ వెంకీ ఖాతాలో పడింది.