మెగాస్టార్ చిరంజీవి 40 ఏళ్లుగా తెలుగు తెరపై తిరుగులేని హీరోగా కొనసాగుతున్నారు. చిరు స్టామినా, ఆయన రేంజ్ వేరు. చిరు సినిమా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అవుతుంది అంటే మెగా అభిమానులకే కాదు.. యావత్ ఇండస్ట్రీలో వాళ్లకు పెద్ద పండగే. ఇక 1990 – 2000 దశకంలో చిరు సినిమా వస్తుంది అంటే తొలి వారం రోజులు థియేటర్ల దగ్గర టిక్కెట్లు లేక బ్లాక్ మార్కెట్ ఎక్కువుగా జరిగేది. అసలు చిరు సినిమాకు తొలి వారం రోజుల్లో టిక్కెట్లు దొరకడమే గగనం అయ్యేది.
ఇక 2002లో చిరంజీవి హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా ఇంద్ర. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత చలసాని అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా అప్పట్లోనే రు. 32 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఆ రోజుల్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో పాటు 122 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఫ్యాక్షన్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి ఇంద్రసేనారెడ్డిగా పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా నటించారు.
ఇక వారణాశి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఫస్టాఫ్ ఉంటుంది. ఆ తర్వాత సెకండాఫ్ సీమ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. చిరు పక్కన ఆర్తీ అగర్వాల్, సోనాలిబింద్రే హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో చిరంజీవి డ్యాన్సులు అప్పట్లో సంచలనం అయ్యాయి. ఇక ఈ సినిమా గురించి దర్శకుడు బి. గోపాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా టిక్కెట్లకు అప్పట్లో విపరీతమైన డిమాండ్ నెలకొందని.. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఓ వ్యక్తి 5 టిక్కెట్లను రు. 10 వేలకు కొనుగోలు చేశాడని తెలిపారు.
ఇంద్ర సినిమా టిక్కెట్ల నేపథ్యంలో జనాలను కంట్రోల్ చేసేందుకు ఎస్పీ స్థాయి అధికారులు కూడా రంగంలోకి దిగారట. ఈ విషయాన్ని ఓ ఎస్పీయే తనకు స్వయంగా చెప్పారని కూడా గోపాల్ చెప్పారు. ఈ సినిమా తర్వాత చిరుకు సెకండ్ ఇన్సింగ్స్‌లో మాంచి ఊపు వచ్చింది.