యువరత్న నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ సినిమా అఖండ బాక్సాఫీస్ దగ్గర అఖండజ్యోతి వెలిగిపోతోంది. ఈ సినిమా రిలీజైన రోజు నుంచి నేటి వరకు వరుస పెట్టి రికార్డ్ ల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఎలాంటి ? అంచనాలు ఉంటాయో ఆ అంచనాలను నూటికి నూరు శాతం అందుకుంది. వీరిద్దరి కాంబినేషన్లో తొలిసారిగా వచ్చిన సింహ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే 2014 సాధారణ ఎన్నికలకు ముందు వచ్చిన లెజెండ్ కూడా సింహాను మించిన బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఈ రెండు సినిమాల తర్వాత హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన అఖండ అయితే సింహ – లెజెండ్ రికార్డులను దాటేసి ఏకంగా బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాలయ్య కెరీర్‌లో ఇప్పటివరకూ వందకోట్ల క్లబ్ లో ఉన్న సినిమాలు ఏవి లేవు. అయితే అఖండ వందకోట్లు దాటి ఏకంగా రు. 150 కోట్లకు చేరువైంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం విదేశాల్లో వసూళ్లు కూడా కలుపుకుంటే అఖండ రు. 200 కోట్ల వసూళ్లు సాధించిందని తెలుస్తోంది. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ముందుగా డివైడ్ టాక్ వచ్చింది.. అలాంటిది ఇప్పుడు రు. 200 కోట్ల వసూళ్లు సాధించడం అంటే అది నిజంగా బాలయ్య క్రేజ్ అని చెప్పాలి.
తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 106 కేంద్రాల్లో అఖండ 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయినా మూడు నాలుగు వారాలకు మించి థియేటర్లలో నిలవడం లేదు. అలాంటిది అఖండ ఏకంగా 106 కేంద్రాల్లో 50 రోజులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. తాజాగా అఖండ మహేష్ బాబు AMB సినిమా థియేటర్ లో రికార్డ్ క్రియేట్ చేసింది.
ఈ మల్టీప్లెక్స్ లో అర్థ శతదినోత్సవం జరుపుకున్న తొలి సీనియర్ హీరో సినిమాగా ( నాన్ మల్టీస్టారర్) నిలిచింది. ఈ థియేటర్లో ఇప్పటివరకు అర్థ శతదినోత్సవం జరుపుకున్న నాలుగవ సినిమాగా అఖండ నిలిచింది. ఈ పెద్ద మల్టీప్లెక్స్ లో 50 రోజులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. కానీ అఖండ ఆ అరుదైన ఫీట్ నమోదు చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అఖండ జోరు చూస్తుంటే కొన్ని సెంటర్లలో వంద రోజులు ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.