టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతోమంది స్టార్ దర్శకులు, అగ్ర నిర్మాతలతో కలిసి ఆయన ఎన్నో హిట్ సినిమాలు చేశారు. అయితే చిరంజీవితో ప్లాప్ సినిమాలు తీసిన కొందరు నిర్మాతలు ఆర్థికంగా కుదేలై నష్టపోయారు. అలాంటి సమయంలో చిరంజీవి ఆ నిర్మాతలకు మరో సినిమా చేసి వారు ఆర్థికంగా కోలుకునేందుకు కొంత వరకు సాయం చేశారు. ఇదిలా ఉంటే చిరంజీవితో భారీ బడ్జెట్ సినిమా తీసిన ఓ అగ్ర నిర్మాత ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో ఆర్థికంగా నష్టపోయారట. ఆ తర్వాత ఆయన ఆస్తులు అన్ని కూడా అమ్ముకున్నారని మరో సీనియర్ నిర్మాత చెప్పారు.
చిరంజీవితో ఘరానా మొగుడు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను కె. దేవీ వరప్రసాద్ నిర్మించారు. చిరు కెరీర్‌లో తొలిసారిగా ఓ సినిమాకు రు. కోటి రెమ్యునరేషన్ తీసుకున్నది ఈ సినిమాకే. ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో 2001లో మృగరాజు సినిమా వచ్చింది. ఈ సినిమాకు కూడా దేవీ వరప్రసాదే నిర్మాత. ఈ సినిమా 2001 సంక్రాంతి కానుకగా వచ్చి డిజాస్టర్ అయ్యింది. అప్పట్లోనే రు. 15 కోట్ల భారీ బడ్జెట్‌తో మృగరాజు తెరకెక్కింది.
దేవీ వరప్రసాద్ చిరంజీవికి రెగ్యులర్ ప్రొడ్యుసర్ అని.. సినిమాలు హిట్ అయినంత వరకు ఆ నిర్మాతలు బ్రహ్మాండం అని అంటారని. ఎక్కడ అయినా తేడా వస్తే ఆ నిర్మాతలను హీరోలు పట్టించుకోవడం లేదని సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ చెప్పారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి వాళ్లు జనవరి 1వ తేదీన నిర్మాతలకు డేట్లు ఇచ్చేవారని.. అసలు కథ, దర్శకుడు ఎవరో తెలియకుండానే డేట్లు ఇచ్చేవారని చెప్పారు.
హీరో కృష్ణ నిర్మాతలు నష్టపోతే ఆ నిర్మాతలకు ఫైనాన్స్ ఇప్పించి మరీ సినిమాలు చేసేశారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు హీరోలు డైరెక్టర్లకు లోకువ అయ్యారని ఆయన వాపోయారు. దేవీ వరప్రసాద్ అమెరికాకు వెళితే చిరంజీవికి షాపింగ్ చేసి వస్తువులు తెచ్చేవారని కూడా కాట్రగడ్డ ప్రసాద్ చెప్పారు. అయితే చివరకు అదే చిరంజీవి సినిమా ప్లాప్ అయ్యాక ఆయన ఆస్తులు అమ్ముకున్నారని.. తర్వాత ఆయన్ను ఎవ్వరూ పట్టించుకోలేదని ప్రసాద్ చెప్పారు.