ఏపీలో కొత్త టిక్కెట్ రేట్లు అమల్లోకి తీసుకు వస్తు జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసేసింది. రేపటి నుంచి రిలీజ్ కానున్న అఖండతో స్టార్ట్ అయ్యి ఇకపై రిలీజ్ సినిమాలకు కూడా కేవలం 4 షోలకే అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసింది. ఇక టిక్కెట్ రేట్లు కూడా చాలా వరకు తగ్గించేసింది. ఈ రేట్లు 1990 కంటే ముందున్న రేట్లకు వెళ్లిపోయాయి. అయితే ఎవ్వరూ కూడా నోరు మెదిపి జగన్ ప్రభుత్వాన్ని అడిగే సాహసం చేయలేకపోతున్నారు. అయితే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు జగన్ పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాస్త ఘాటుగానే స్పందించారు.
ఏపీలో సినిమాల షోలు, టిక్కెట్ రేట్లు తగ్గింపు నిర్ణయం కరెక్ట్ కాదని ఆయన చెప్పారు. తాను 45 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నానని.. తన అభిప్రాయాలు అర్థం చేసుకోవాలని రాఘవేంద్ర రావు కోరారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం ప్రేక్షకులు, థియేటర్ల యజమానులు, పంపిణీ దారులే అని ఆయన చెప్పారు.
సగటు వ్యక్తికి ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాయే అని.. సినిమాను థియేటర్లలో చూసిన అనుభూతి టీవీలో చూస్తే రాదని ఆయన చెప్పారు. ఇక షోలతో పాటు టిక్కెట్ రేట్లు తగ్గించడం వల్ల అందరూ నష్టపోతారని.. 100 సినిమాల్లో కేవలం 10 సినిమాలు మాత్రమే హిట్ అవుతాయని ఆయన చెప్పారు. ఇక ఆన్లైన్ టిక్కెట్ల వల్ల దోపిడీ ఆగిపోతుందని అనుకోవడం కరెక్ట్ కాదన్న ఆయన మంచి సినిమా వస్తే ప్రేక్షకుడు రు. 500 పెట్టి అయినా చూస్తాడని.. అదే సినిమా బాగో లేకపోతే రూపాయి పెట్టి కూడా చూడడని రాఘవేంద్రరావు తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆన్ లైన్ వల్ల ఇన్ ప్లూయన్స్ ఉన్న వారు బ్లాక్ లో టికెట్లు అమ్మే అవకాశం ఉందని… టికెట్ రేట్లు పెంచి ఆన్ లైన్ లో అమ్మటం వల్ల టాక్స్ ఎక్కువ వస్తుందని ఆయన చెప్పారు. ఏదేమైనా రాఘవేంద్ర రావు కాస్త ఘాటుగానే జగన్ ప్రభుత్వ నిర్ణయంపై స్పందించారు. మరి మిగిలిన సినిమా పెద్దలు ఎలా స్పందిస్తారో ? చూడాలి.