తెలుగు సినిమా పరిశ్రమ మాత్రమే కాకుండా తెలుగు జాతి గర్వించదగ్గ వారిలో లెజండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు ఒకరు. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన నాగేశ్వరరావు సినిమా ఎంట్రీ చాలా ఆసక్తికరంగా సాగింది. నాగేశ్వరరావు ఫ్యామిలీ మొత్తం ఐదుగురు అన్నదమ్ములు. అప్పట్లో వీరికి 25 ఎకరాల పొలం వుండేదట. నాగేశ్వరరావు వాటాగా ఐదు ఎకరాలు పొలం వచ్చింది. అప్పట్లో ఎకరం పొలం ఖరీదు రు. 600. చిన్నవయసులోనే నాగేశ్వరరావు నాటకాల్లో అమ్మాయి వేషాలు వేసే వారట. దిగ్గజ దర్శకుడు దుక్కిపాటి మధుసూదన రావు నాగేశ్వరరావులో ఉన్న టాలెంట్ ను గుర్తించి ఆయనను ఎంతో ప్రోత్సహించారు.
ఈ క్రమంలోనే ఒకరోజు గుడివాడ రైల్వే స్టేషన్ లో నాగేశ్వరరావు ప్లాట్ ఫామ్ మీద సామాన్లు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు. నాటకాలు వేసి ఆయన ఇంటికి తిరిగి వెళుతున్నాడు. అదే సమయంలో బందరు నుంచి రైల్లో వస్తున్నా దివంగత లెజెండ్రీ సంగీత దర్శకుడు ఘంటసాల బలరామయ్య గారు నాగేశ్వరరావును చూశారు. ఘంటసాల రైల్లో నుంచే నాగేశ్వరరావును దగ్గరికి పిలిచి వివరాలు తెలుసుకున్నారు.
ఏం చేస్తావ్ ? అని అడగడంతో నాగేశ్వరరావు తను నాటకాల్లో అమ్మాయి వేషం వేస్తారు అని చెప్పారు. నాగేశ్వరరావును చూడగానే కనెక్ట్ అయిన ఘంటసాల వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి వారి ఫ్యామిలీ తో మాట్లాడి ఆయన సినిమాల్లో నటించేందుకు ఒప్పించారు. అయితే అప్పటికే నాగేశ్వరరావు చేయాల్సిన కొన్ని నాటకాలు ఉండడంతో మధుసూదన రావు 22 రోజులు చెన్నైలో ఉండేలా… మిగిలిన ఐదు రోజులు గుడివాడ వచ్చి ఐదు నాటకాలు వేసేలా అగ్రిమెంట్ రాయించారట.
ఆ ఒప్పందం ప్రకారం ఏఎన్ఆర్ చెన్నై వెళ్లి సినిమాల్లో నటించారు. అలా ప్రారంభమైన ఆయన సినిమా ప్రస్థానం అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ రోజు ఏఎన్నార్ వంశం నుంచి మూడో తరం హీరోలుగా కూడా అఖిల్, చైతన్య నటిస్తున్నారు.