నేచురల్ హీరోయిన్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న జయసుధ నాలుగు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఈ వయస్సులో కూడా అమ్మ, అత్త, నానమ్మ పాత్రలతో మెప్పిస్తున్నారు. జయసుధ కేవలం అందంతో మాత్రమే కాదు.. అభినయంతో కూడా ప్రేక్షకులను మెప్పించారు. అందుకే ఈ తరంలో కూడా ఆమెకు భారీగా అభిమానులు ఉన్నారు.
ఇక అప్పట్లో జయసుధ జనరేషన్‌కు కాస్త ముందు స్టార్ హీరోయిన్లు ఎవరా అని ప్రశ్నించుకుంటే మహానటి సావిత్రి – జమున – నిర్మల – వాణిశ్రీ లాంటి గొప్ప హీరోయిన్లు గుర్తుకు వస్తారు. ఓ ఇంటర్వ్యూలో జయసుధ సావిత్రిని టార్గెట్‌గా చేసుకుని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఆ తరం హీరోయిన్లలో గొప్ప నటి అని ఎవరు అయినా ప్రశ్నిస్తే చాలా మంది సావిత్రి పేరు మాత్రమే చెపుతారని.. ఆమె అంత పెద్ద తోఫా.. మరి అదే టైంలో వాణి శ్రీ, జమున, శారద గారు కూడా ఎంతో బాగా నటించారు అని వారు పేర్లు ఎందుకు చెప్పరంటూ సూటి ప్రశ్న వేసింది.
సావిత్రి గారి తర్వాత వాణిశ్రీ కూడా చాలా గొప్ప సినిమాలు చేసినా ఆమె గురించి ఎంతమంది చెపుతారని జయసుధ ప్రశ్నించింది. ఇక శారద గారు హీరోయిన్‌గా మాత్రమే కాకుండా.. మదర్, పోలీస్ ఆఫీసర్ లాంటి పవర్ ఫుల్ పాత్రలు కూడా పోషించారు అని.. అయితే విమెన్ ఇన్ తెలుగు అని చెప్పాలంటే కేవలం సావిత్రి గారి గురించే మాట్లాడుతున్నారు.. వారి తర్వాత చాలా మంది మంచి పాత్రలు చేసినా వారికి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదన్నారు.
ఇక చాలా మంది చిన్న హీరోలతో ఎందుకు చేస్తారని ప్రశ్నించారని.. అయితే పాత్ర నచ్చితే తాను ఎవరితో అయినా నటించేందుకు సిద్ధమే అని.. గోవిందుడు అందరివాడేలే, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఎవడు ఇలా ఏ సినిమా చేసినా కూడా తనకు మంచి పేరే వచ్చిందని జయసుధ చెప్పారు. ఏదేమైనా సావిత్రి తరంలో చాలా మంది స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నా ఎక్కువ మంది సావిత్రి పేరు పదే పదే ప్రస్తావిస్తూ ఉండడంతో జయసుధ ఈ వ్యాఖ్యలు చేసిందేమో అన్న గుసగుసలు అప్పట్లో వినిపించాయి.