టాలీవుడ్‌లో కొణిదల ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ఫ్యామిలీ నుంచే ఇండస్ట్రీలో 12 మంది హీరోలు ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే మెగాఫ్యామిలీ ఇప్పుడు టాలీవుడ్‌లో సగం అని చెప్పాలి. ఏడాదిలో ప్రతి నెలా మెగా ఫ్యామిలీ హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ ఫ్యామిలీ నుంచి నాగబాబు కుమార్తె, మెగా ప్రిన్స్ నిహారిక వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఆమె తన కెరీర్లో మొత్తం నాలుగు సినిమాలు చేసింది.
ఆ తర్వాత గుంటూరుకు చెందిన మాజీ పోలీసు అధికారి కుమారుడు జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది. ప్రస్తుతం అటు ఫ్యామిలీ లైఫ్ తో పాటు ఇటు తనకు ఇష్టమైన ఎంటర్టైన్‌మెంట్ రంగంలో కూడా రాణిస్తోంది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి నిర్మాతగా మారిన నిహారిక ప్రస్తుతం వెబ్‌సీరిస్‌లు నిర్మిస్తోంది. ఇండస్ట్రీలో పేరున్న నటీనటులతోనే వెబ్‌సీరిస్‌లు ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక ప్రముఖ టీవీలో ఓ కార్యక్రమానికి వచ్చిన నిహారిక తన పెదనాన్న చిరంజీవి నటించిన సినిమాల్లో బావగారు బాగున్నారా సినిమా తనకు చాలా ఇష్టమని… ఆ సినిమా ఎక్కువ సార్లు చూసాను అని చెప్పింది. బావగారు బాగున్నారా సినిమా తర్వాత రుద్రవీణ సినిమా కూడా ఎక్కువ సార్లు చూశాను అని తెలిపింది.
అలాగే బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ సినిమా అంటే ఎంతో ఇష్టమని ఈ సినిమాను కూడా తను ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదని చెప్పింది. ఇక ఆరెంజ్ సినిమా ఫ్లాపయి నాన్న నాగబాబు ఆర్థికంగా నష్టపోయినప్పుడు ఎన్నో పాఠాలు నేర్చుకున్నారని తెలిపింది. ఒక్కసారిగా ఆ సినిమా ఫ్లాప్ అయ్యి పాతాళానికి వెళ్లి తిరిగి ఎన్నో కార్యక్రమాలు చేసి ఇప్పుడు నిలదొక్కుకున్నారు అని ప్రశంసించింది.