ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే స్టార్ హీరో, హీరోయిన్లు… స్టార్ దర్శకుడు, భారీ బడ్జెట్ మాత్రమే ముఖ్యం కాదు. కథలో దమ్ము ఉండాలి. కథాబలం ఉన్న సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. అలాగే మంచి కథకి తోడు కథనం మంచి టైటిల్ కూడా ఉండాలి. ప్రేక్షకులను ముందుగా సినిమా థియేటర్ లోకి రప్పించడానికి టైటిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదిలా ఉంటే కథ డిమాండ్ చేసిందో లేదా కావాలని పెట్టారో తెలియదు కానీ… కొందరు టాలీవుడ్ హీరోలు తమ ఒరిజినల్ పేరు తాము నటించిన ఈ సినిమాలకు టైటిల్ గా పెట్టుకున్నారు. తమ పేరును తమ సినిమాకు టైటిల్ గా పెట్టుకున్న హీరో ఎవరో ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
అక్కినేని అఖిల్:
అక్కినేని వంశంలో మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తన తొలి సినిమాకు తన పేరునే పెట్టుకున్నారు. నితిన్ నిర్మాత గా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 2015లో దీపావళి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
అక్కినేని నాగార్జున:
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హీరోగా 1986లో కెప్టెన్ నాగార్జున అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకు జగపతి బాబు తండ్రి ప్రముఖ దర్శక, నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు. కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఖుష్బూ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
మంచు విష్ణు:
మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు తన తొలి సినిమాకు విష్ణు పేరే టైటిల్‌గా పెట్టారు. ప్రముఖ మలయాళ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శిల్పా శివానంద్ హీరోయిన్. 2003లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది.
రామ్‌చరణ్:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పేరు కలిసి వచ్చేలా బోయపాటి శీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమా చేశారు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇలాంటి సినిమా చేసినందుకు క్షమించాలని రామ్ చరణ్ అభిమానులకు ఒక లేఖ కూడా రాశారు.
ఎన్టీఆర్:
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పేరు కలిసివచ్చే లా హరీష్ శంకర్ దర్శకత్వంలో రామయ్యా వస్తావయ్యా సినిమా చేశారు. 2013లో వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ అయింది.
చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి తన పేరుతో జై చిరంజీవ సినిమా చేశారు అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకు విజయభాస్కర్ దర్శకత్వం వహించారు ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.