ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన సంఘటనలు తెలుగుదేశం పార్టీ అభిమానులతోపాటు నందమూరి కుటుంబ సభ్యులు వారి అభిమానులను తీవ్రంగా కలిచి వేసేలా ఉన్నాయి. అసెంబ్లీలో వైసీపీ నేతలు చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటంతో పాటు ఆయన భార్య భువనేశ్వరి ప్రస్తావన తీసుకు వచ్చి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం చాలా మందిని బాధించింది. ఎప్పుడూ గంభీరంగా ఉండే చంద్రబాబు సైతం వైసీపీ నేతలు అన్న మాటలకు చిన్నపిల్లాడిలా ఏడ్చేశారు. బాబు కన్నీళ్ళ పై ఆంధ్ర ప్రదేశ్ ఎంతో ఆవేదనకు గురి అవుతోంది.
ఈ క్రమంలోనే నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఒకే తాటిపైకి వచ్చి స్పందిస్తున్నారు. ఇప్పటికే అదే కుటుంబానికి చెందిన నందమూరి కళ్యాణ్‌రామ్‌తో పాటు నారా రోహిత్ అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి దీనిపై స్పందించారు. నందమూరి కుటుంబానికి చెందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు నిమిషాల పాటు ఉన్న వీడియో ద్వారా ఈ ఘటనపై తన స్పందన వినయంగా తెలియజేశారు.
ఈ క్రమంలోనే రాజకీయ నాయకులకు కొన్ని సూచనలు కూడా తెలియజేశారు. రాజకీయ నేతల విమర్శలు ప్రజా సమస్యలపై ఉండాలే కాని.. ఇక్కడ వ్యక్తిగత విమర్శలు, దూషణలకు చోటు ఉండకూడదని ఎన్టీఆర్ సూచించారు. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలను పూర్తిగా పక్కనపెట్టి… వ్యక్తిగత దూషణలు… విమర్శలకు దిగుతామో అప్పుడే అరాచక పాలన మొదలైనట్టు అవుతుందని తెలిపారు.
మనం మన ఆడపడుచులను ఎప్పుడూ గౌరవించుకోవాలని.. అది మన సంస్కృతి అని కూడా చెప్పారు. రాజకీయ నాయకులు విమర్శలు రాబోయే తరానికి వ్యవహరించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు