హీరోయిన్లు కేవలం తమ నటన, అందంతో మాత్రమే కాకుండా.. తమలో ఉన్న అనేక షేడ్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. కేవలం హీరోయిన్ పాత్రో లేదా సెకండ్ హీరోయిన్ పాత్రో, లేదా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడమో కాదు… కొందరు స్టార్ హీరోయిన్లు విలన్లుగా కూడా నటించి ప్రేక్షకులను మైమరిపించారు. అలాంటి స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.
రమ్యకృష్ణ రజనీకాంత్ నరసింహా సినిమాలో ఎంత పవర్ ఫుల్ హీరోయిన్‌గా నటించిందో చూశాం. ఆమె వేసిన నీలాంబరి క్యారెక్టర్ తెలుగు ప్రేక్షకుల మదిలోనే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఎవ్వరూ మర్చిపోలేని విధంగా ఉంటుంది.
సూపర్‌స్టార్ కృష్ణ గూఢచారి 117 సినిమాలో భానుప్రియ డబుల్ రోల్ చేసింది. ఇందులో ఓ పాత్ర విలన్. అలాగే చిరంజీవి ఖైదీ నెంబర్ 786 సినిమాలో కూడా ఆమె నెగిటివ్ రోల్ చేసింది.
సౌందర్య శ్రీకాంత్ నటించిన నా మనసిస్తారా సినిమాతో పాటు నాగార్జున ఎదురులేని మనిషి సినిమాలో విలన్‌గా చేసింది. అయితే ప్రేక్షకులు ఈ రెండు సినిమాలను తిరస్కరించారు. మహేష్‌బాబు – తేజ కాంబోలో వచ్చిన నిజం సినిమాలో రాశీ చేసిన విలన్ క్యారెక్టర్ మరీ ఘోరంగా ఉంటుంది.
శ్రీయారెడ్డి విశాల్ పక్కన హీరోయిన్‌గా చేయడమే కాకుండా.. పొగరు సినిమాలో మరీ భయంకరమైన విలన్‌గా మెప్పించింది. తర్వాత అదే శ్రీయా రెడ్డి విశాల్‌కు వదిన అయ్యింది. నిఖిత నాగార్జున డాన్ సినిమాలో విలన్‌గా చేసింది.
ఇక రీమాసేన్ కార్తీ యుగానికి ఒక్కడు, శింబు వల్లభ సినిమాలో నటించింది. స్టార్ హీరోయిన్ సమంత కూడా విక్రమ్ పత్తు ఎంద్రాకుల్లా సినిమాలో విలన్‌గా చేసినా ఆ క్యారెక్టర్ ఒప్పలేదు. తమన్నా నితిన్ మాస్ట్రోలో విలన్ రోల్ చేసింది.
రెజీనా అడవి శేష్ ఎవరులో విలన్‌గా చేసింది. కాజల్ సీత సినిమాలో, పాయల్ రాజ్‌పుత్ ఆర్ ఎక్స్ 100లో, త్రిష ధర్మయోగిలో ప్రియమణి చారులతలో విలన్ పాత్రలు వేశారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ అయితే క్రాక్, తెనాలి రామకృష్ణ ఎల్ఎల్‌బీ, పందెంకోడి 2 లేడీ విలన్‌గా అదర గొట్టేసింది.