కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించి విషయం తెలిసిందే. తన ఇంట్లో వర్క్ అవుట్స్ చేస్తున్న సమయంలో గుండెల్లో నొప్పి రావడంతో..హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండాపోయింది. ఆస్పత్రిలో చికిత్స్ తీసుకుంటూ పునిత్ తుది శ్వాస విడిచారు. దీంతో చాలా మందికి తీరని శోకాన్ని మిగిల్చాడు. కర్ణాటక ప్రజలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులతో సహ తెలుగు చిత్రపరిశ్రమ, తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు దేశ విదేశాల్లోని భారతీయులు సంతాపం వ్యక్తం చేశారు.
పునీత్ రాజ్ కుమార్ ఒక హీరోనే కాకుండా ఆయన చేసిన సమాజసేవకు వెలకట్లలేమని అనేక మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్ట్ ప్రత్యేక్షమైంది. ఇక సందేశాన్ని పోస్ట్ చేసిన యువకుడిని బెంగళూరు నగర సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బీర్ బాటిల్‌తో అవమానకరమైన పోస్ట్‌ను అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తుంది.
కాగా.. పునీత్ మృతి నేపథ్యంలో నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా బెంగళూరు పోలీసులు ఆదివారం వరకు మద్యం విక్రయాలను నిషేధించారు. నెటిజన్ పోస్టుకు ఇదే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్ మాట్లాడుతూ “ఒక యువకుడిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించాము. సైబర్ టీమ్ దీనిపై విచారణ జరుపుతోంది” అని తెలిపారు. అయితే అరెస్టైన యువకుడికి సంబంధించిన వివరాలను పోలీసులు తెలుపలేదు. ఇక అతని పై పునిత్ అభిమానులు కోపంగా ఉన్నారు. తమ అభిమాన నటుడిని కించపరుస్తూ పోస్ట్ చేసినందుకు తిట్టిపోస్తున్నారు.