ఏపీలో సినిమా ఇండస్ట్రీని టార్గెట్‌గా చేసుకుని జగన్ ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలకు ఇండస్ట్రీ వాళ్లు కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంటున్నారు. ఎవ్వరూ సాహసం చేసి జగన్‌ను విమర్శించే పరిస్థితి లేదు. చాలా మంది అయితే లోపలే తమ బాధ అణుచుకుంటూ ఆవేశ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రమే దీనిపై కాస్త నోరుమెదపినా ఆయన్ను కూడా ఏపీ ప్రభుత్వంలో మంత్రులు గట్టిగా టార్గెట్ చేశారు. ఇప్పటికే ఇండస్ట్రీ పెద్దలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు వరుసగా ఏపీ మంత్రి పేర్ని నానితో చర్చలు జరుపుతూనే ఉన్నారు.
ప్రభుత్వం మాత్రం టిక్కెట్ రేట్లను 20 ఏళ్ల క్రితం రేట్ల స్థాయికి తగ్గించేయడంతో పాటు ఆన్‌లైన్ టిక్కెటింగ్ వ్యవస్థ తెరమీదకు తేవడంతో పెద్ద సినిమాలకు ఏపీలో వసూళ్లు రావడం లేదు. ఇంకా చెప్పాలంటే ఏపీలో బిజినెస్ పూర్తయిన పెద్ద సినిమాల బిజినెస్‌లో 30 % తగ్గించేస్తున్నారు. ఏపీలో రిలీజ్ అయ్యే ప్రతి పెద్ద సినిమాల బిజినెస్‌తో పాటు వసూళ్లకు భారీగా గండిపడుతోంది.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం దీనిపై కొద్ది రోజులుగా అసహనంతోనే ఉంటున్నారు. ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆయన వేడుకున్నారు. అయినా ఏపీ ప్రభుత్వం కనికరించలేదు. తాజాగా మరోసారి ఆయన జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పరోక్షంగా తన అసహనం వ్యక్తం చేశారు. సంతోషం – సుమన్ టీవీ సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్ – 2021 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.
సినిమా కూడా సమాజానికి సేవ చేసే మాధ్యమమే అన్న ఆయన తాను రాజకీయాల్లోకి వచ్చి ఏదో చేయాలని అనుకున్నానని.. ప్రజలకు ఏదో మంచి చేయాలనుకున్నానని.. అయితే అక్కడ ఐదేళ్లు మాత్రమే అధికారం ఉంటుందని.. ఇండస్ట్రీలో ఉన్న మంచి అక్కడ లేదని చిరు కాస్త ఉద్వేగంగా చెప్పారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ప్రజలు ఎప్పటికో కాని అధికారం ఇవ్వరని చిరు తెలిపారు.
సినిమా ఇండస్ట్రీలో మాత్రం ప్రేక్షకులు ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని చెప్పారు. సినిమా టిక్కెట్ల రేట్లను ప్రభుత్వాలు నిర్ణయించడం పట్ల కూడా చిరు తన అభ్యంతరం వ్యక్తం చేశారు. మా దగ్గర డబ్బులు ఎక్కువై తాము రు. 100 కోట్లు పెట్టి సినిమాలు తీయడం లేదని.. సినిమా స్థాయిని పెంచడానికి మాత్రమే తాము సినిమాలు చేస్తున్నామని చిరు ఆవేదనతో మాట్లాడారు.
ఇలాంటి టైంలో సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గిస్తే పెద్ద సినిమాలు ఎలా ? వస్తాయి ? టిక్కెట్ రేటు పెరిగితే ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో ఆదాయం రావడంతో పాటు లక్షలాది మందికి ఉపాధి వస్తుందని చిరు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇబ్బందుల గురించి మీ అపాయింట్‌మెంట్ కోసం వెయిట్ చేశానని.. అపాయింట్‌మెంట్ రాకపోవడంతోనే తన ఆవేదన ఇలా ఓపెన్‌గా చెప్పానని చిరు చెప్పారు.
ఇక గతంలో రాజులు కూడా కళాకారులను గౌరవించి.. కళలను పోషించే వారని.. ఇప్పుడు ప్రభుత్వాలు నంది అవార్డులు కూడా ఇవ్వడం లేదని.. దీనిపై తాను ప్రభుత్వాలు దృష్టికి తీసుకు వెళ్లినా స్పందన లేదని చిరు వాపోయారు. ఏదేమైనా చిరు ఆవేదన, అసహనం అంతా జగన్ ప్రభుత్వంపైనే అని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.