టాలీవుడ్‌లో కొన్ని దశాబ్దాల క్రతం సీనియర్ ఎన్టీఆర్ వర్సెస్ సూపర్‌స్టార్ కృష్ణ మధ్య వార్ నడిచేది. వీరిద్దరు పోటాపోటీగా సినిమాల్లో నటించడంతో పాటు తమ సినిమాలను కూడా అంతే పోటీగా రిలీజ్ చేసేవారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఒకే రోజు విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ దానవీర శూర కర్ణ, కృష్ణ కురుక్షేత్రం ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. కావాలని పోటాపోటీగానే ఈ సినిమాలను రిలీజ్ చేశారు. ఈ రెండూ కూడా మహాభారత కథతోనే తెరకెక్కాయి.
ఇక సీనియర్ ఎన్టీఆర్‌ను కృష్ణ ఎన్నో సందర్హాల్లో విబేధించారు. అయినా కూడా కృష్ణ ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఆయన స్ఫూర్తితోనే కృష్ణ సినిమాల్లోకి వచ్చారు. తర్వాత మళ్లీ అదే ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి కృష్ణ విచిత్రంగా ఓ సినిమాలో తనకు వేషం కావాలని ఎన్టీఆర్‌ను అడిగారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం.
ఎన్టీఆర్ సీతారామ కళ్యాణం సినిమాలో నటించినప్పుడు ఎన్టీఆర్‌ను కలిసిన కృష్ణ ఆ సినిమాలో రాముడి వేషం ఇవ్వాలని ఆయన్ను కోరారట. అందుకు ఎన్టీఆర్ చిన్న వయస్సులో ఉన్న కృష్ణతో అప్పుడే నువ్వు రాముడి వేషానికి సరిపోవని చెప్పారట. లక్ష్మణుడి పాత్ర కూడా వేరే వాళ్లకు ఇచ్చేశానని అన్నారట. మూడేళ్ల తర్వాత కనిపించాలని ఎన్టీఆర్ చెప్పారట. అప్పటకీ కృష్ణ వయస్సు 18 సంవత్సరాలు.
అయితే మూడేళ్లకు కృష్ణ తేనెమనసులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తన తొలి సినిమా షూటింగ్‌కు ముందు కూడా కృష్ణ ఎన్టీఆర్‌ను కలిసి మరీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కృష్ణ, ఎన్టీఆర్ కలిసి నటించారు. వృత్తి పరమైన పోటీ నేపథ్యంలో వీరిద్దరి మధ్య తెలియకుండానే విబేధాలు, స్పర్థలు వచ్చినా తర్వాత వీరు ఎప్పుడూ కలిసిపోయేవారు.