తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ఎంజాయ్ చేసిన రోజా తర్వాత రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లో ఈ స్థాయికి రావడానికి రోజా ఎంతో కష్టపడ్డారు. 15 ఏళ్ల పాటు తెలుగుదేశంలో ఉన్న ఆమె రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నో అవమానాల తర్వాత పోరాటం చేసి వైసీపీ నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆమె సినిమా రంగంలో కూడా ఎన్నో అవమానాలు దిగమింగుకుని స్టార్ హీరోయిన్ అయ్యారు.
చిత్తూరు జిల్లాలో తిరుపతిలో 1972 నవంబర్ 17న నాగరాజు రెడ్డి, లలితా దంపతులకు జన్మించారు. రోజా పద్మావతి యూనివర్సిటీ లో డిగ్రీ పూర్తి చేశారు. ఆమె హీరోయిన్ కాకముందు కూచిపూడి డాన్సర్ గా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. దివంగత మాజీ ఎంపీ, సీనియర్ నటుడు శివప్రసాద్ దర్శకత్వం వహించిన ప్రేమ తపస్సు సినిమాతో రోజా సినీ ప్రయాణం మొదలైంది. శివప్రసాద్ శ్రీలత రెడ్డిగా ఉన్న ఆమె పేరును రోజాగా మార్చేశారు. అయితే రోజా నటించిన మొదటి చిత్రం ప్రేమ తపస్సు అయినా.. ఆమె సినీ ప్రయాణం మొదలైంది మాత్రం సర్పయాగంతోనే..!
అప్పటివరకు చిన్నాచితక పాత్రలు వేసుకుంటూ వచ్చిన రోజా కెరీర్ను 1992లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సీతారత్నం గారి అబ్బాయి ఒక్కసారిగా టర్న్ చేసింది. అప్పటివరకు రోజా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. ఛాన్సుల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఒక దశలో సినిమాలు మానేయాలని అనుకున్నారు. చాలా చిన్న, ప్రాధాన్యం లేని పాత్రలు మాత్రమే ఆమెకు వచ్చేవి. సీతారత్నం గారి అబ్బాయి హిట్ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.
ఆ తర్వాత ఆమె వరుసగా ముఠామేస్త్రి – ముగ్గురు మొనగాళ్లు – భైరవద్వీపం – గాండీవం – బొబ్బిలిసింహం – శుభలగ్నం వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ క్రమంలోనే తమిళంలో కూడా పలు సినిమాల్లో నటించిన రోజా తమిళ్ డైరెక్టర్ ఆర్కే సెల్వమణిని ప్రేమ వివాహం చేసుకుంది.