తెలుగు సినిమా రేంజ్ బాగా పెరిగిపోయింది. అయితే 20 ఏళ్ల క్రితం తెలుగు సినిమా బడ్జెట్ మహా అయితే రు. 15 – రు. 20 కోట్ల మధ్యలో ఉండేది. అప్పట్లో స్టార్ హీరోల సినిమాలకే ఆ స్థాయి వసూళ్లు వచ్చాయి. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన నువ్వే కావాలి సినిమా ఈ రోజుల్లోనే రు. 20 కోట్ల షేర్ రాబట్టి ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యింది. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు నిర్మించిన ఈ సినిమాతో బాలనటుడు తరుణ్ హీరో అయితే.. రీచా హీరోయిన్ అయ్యింది.
కె. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు.
అప్పట్లో కేవలం రు. కోటి బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రు. 20 కోట్ల వసూళ్లు రాబట్టింది. రామోజీరావుకు ఈ సినిమా కాసుల వర్షం కురిపించేసింది. అది కూడా కొత్త హీరో, హీరోయిన్లతో ఈ రేంజ్ వసూళ్లు అంటే అప్పట్లో పెద్ద హీరోలు, నిర్మాతలు సైతం నోరెళ్ల బెట్టారు. 2000 సంవత్సరంలో వచ్చిన నువ్వేకావాలి ఈ యేడాది ఉత్తమ జాతీయ తెలుగు సినిమాగా అవార్డుతో పాటు నాలుగు ఫిలింఫేర్ అవార్డులను కూడా దక్కించుకుంది.
అంతకు ముందే అదే ఉషాకిరణ్ బ్యానర్లో తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక నువ్వేకావాలి వచ్చిన సంవత్సరమే నాగార్జున ఆజాద్, మహేష్ బాబు వంశీ, పవన్ కళ్యాణ్ తమ్ముడు, వెంకటేష్ కలిసుందాం రా, జయం మనదేరా సినిమాలు కూడా వచ్చాయి. అయితే వాటిన్నింటి కంటే కూడా నువ్వే కావాలి ఏకంగా కొన్ని కేంద్రాలలో 365 రోజులు ఆడి రికార్డు సృష్టించింది.