మెగాస్టార్ చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2009లో జరిగిన ఎన్నికలలో టీడీపీ, కాంగ్రెస్‌తో తలపడి 18 సీట్లతో సరిపెట్టుకున్నారు. ఎన్నో అంచనాల మధ్య పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా చిరు మాత్రం పార్టీని నడపలేక కాంగ్రెస్లో విలీనం చేసేశారు. ఇక పార్టీ అధ్యక్షుడి హోదాలో తిరుపతి, పాలకొల్లులో పోటీ చేసిన ఆయన పాలకొల్లులో ఓడి, తిరుపతిలో 10 వేల ఓట్లతో గెలిచారు. ఆ తర్వాత ఆయన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాక… రాజ్యసభకు ఎంపికై కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు.
ఇక చిరంజీవి పార్టీపై అప్పట్లో కాపు ముద్ర వేశారు. అయితే ఆయన పార్టీ నుంచి కమ్మ ఎమ్మెల్యేలు, రెడ్డి ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. 18 మంది ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది కాపులే ఉన్నారు. విశాఖ జిల్లా నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావు – అవంతి శ్రీనివాస్ – చింతలపూడి వెంకట్రామయ్య – పంచకర్ల రమేష్‌బాబు నలుగురు కాపులే. ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఆ పార్టీ నుంచి గెలిచిన నలుగురు పంతం గాంధీ, వంగా గీత, బండారు సత్యనారాయణ మూర్తి, కురసాల కన్నబాబుతో పాటు పశ్చిమలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఈలి నాని కూడా కాపు వర్గమే. ఇక తిరుపతిలో చిరంజీవి గెలిచారు.
అయితే కమ్మ వర్గానికి చెందిన యలమంచిలి రవి విజయవాడ తూర్పులో 190 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసిన గద్దె రామ్మోహన్, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దేవినేని నెహ్రూలను ఓడించారు. వారిద్దరు కూడా కమ్మ నేతలే. ఇక ప్రజారాజ్యం నుంచి దివంగత శోభా నాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి రెడ్డి వర్గం నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు.