గత మా ఎన్నికల తర్వాత నరేష్ అధ్యక్షుడు అయ్యాక డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ మంచి ఉంటే మైకులో చెప్పండి.. చెడు ఉంటే చెవిలో చెప్పుకుందాం అని స్పీచ్ ఇచ్చారు. అయితే ఆయన ఆ డైలాగ్ చెప్పిన ఐదు నిమిషాలకే రాజశేఖర్ ఎంట్రీ ఇచ్చి మైకులాక్కుని నానా గందరగోళం చేశాడు. వెంటనే చిరంజీవి సీరియస్ అయ్యి.. మా పెద్దరికానికి విలువలేదని.. రాజశేఖర్‌పై డిసిప్లైన్ కమిటీ యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. ఇక నరేష్ అధ్యక్షుడిగా ఉన్న ఈ రెండేళ్లలో జరగాల్సినన్ని గొడవలు జరిగి.. మా పరువు కాస్తా బజారున పడింది.
సరే ఆ రోజు చిరంజీవి చెప్పిన ఆ మంచి, చెడు డైలాగ్ అందరిని ఆకట్టుకుంది. కట్ చేస్తే ఇప్పుడు మా ఎన్నికలకు ముందు ఆయన సోదరుడు నాగబాబు చేసిందేంటి ? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు మా ఎన్నికలలో ప్రకాష్‌రాజ్ ను ముందు పెట్టిందే మెగా ఫ్యామిలీ అన్న టాక్ ఉంది. స్వయగా ఈ విషయాన్ని మెగా బ్రదర్ నాగబాబే చెప్పారు. ప్రకాష్‌రాజ్ కోసం ఎప్పుడో ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఆయన్ను గెలిపించాలని.. ఆయనకు మా ఫ్యామిలీ సపోర్ట్ ఉందని చెప్పారు.
అక్కడి వరకు బాగానే ఉంది. తర్వాత రోడ్డెక్కి రచ్చ చేయడం.. ఇటు యూట్యూబ్‌లో, పలు ఛానెల్స్ చర్చల్లో మాటలు తూలడం.. కోట శ్రీనివాసరావు లాంటి సీనియర్లను ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం, అటు ప్రత్యర్థి ఫ్యానెల్గా ఉన్న విష్ణుతో పాటు మోహన్‌బాబు ఫ్యామిలీని టార్గెట్ గా చేసుకుని మాట్లాడడం, ఇటు పోసానిని తిట్టడం ఇలా నాగబాబు చేసిన డ్యామేజ్ ఇప్పుడు మా ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్ ఓటమికి మాత్రమే కాదు.. భవిష్యత్తులోనే మెగా ఫ్యామిలీకి పెద్ద దెబ్బ పడేలా చేసింది.
నాడు చిరంజీవి రాజశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరి ఇప్పుడు తమ్ముడు నాగబాబు విషయంలో ఏం చెపుతారో ? అంటూ సోషల్ మీడియాలో ఒక్కటే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు మెగా ఫ్యామిలీకి నాగబాబే మైనస్‌గా మారారాని.. చిరు తమ్ముడిని కంట్రోల్ చేయాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు.